kumaram bheem asifabad- వరికి మద్దతు ధర దక్కాలంటే..
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:33 PM
ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి వరి కోతలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే పంట చేతికొస్తోంది. ఇప్పటికే కొన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా మరో వారంలోగా అన్ని చోట్ల ప్రారంభం కానున్నాయి. ఆరుగాలం శ్రమించి వరి పంట పండించిన రైతులు తమ పంటకు ప్రభుత్వం మద్దతు ధర పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు.
- తేమ శాతం 17 లోపు ఉండేలా ఆరబెట్టాలి
కౌటాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి వరి కోతలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే పంట చేతికొస్తోంది. ఇప్పటికే కొన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా మరో వారంలోగా అన్ని చోట్ల ప్రారంభం కానున్నాయి. ఆరుగాలం శ్రమించి వరి పంట పండించిన రైతులు తమ పంటకు ప్రభుత్వం మద్దతు ధర పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. ముఖ్యంగా ధాన్యం ఆరబోయకుండా మార్కెట్‌కు తీసుకెళ్లి మద్దతు ధర రాక నష్ట పోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు వరి కోతల నుంచి అమ్మకం వరకు తగిన జాగ్రత్తలు పాటిస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
- ఇలా చేయాలి..
వరి గింజలన్నీ బంగారు రంగులోకి వచ్చిన తరువాతనే కోతలు ప్రారంభించాలి. వరి కోతకు ముందు పొలంలో ఉన్న కల్తీ మొక్కలను తీసి వేయాలి. కోతకు 15 నుంచి 20 రోజులు ముందే నీటి తడులు ఆపివేయాలి. 1010 రకం వరి గింజలు బంగారు రంగులోకి వచ్చే వరకు ఆగితే రాలి పోతాయి. ఈ ఒక్క రకాన్ని గోధమ రంగులోకి రాగానే కోయాలి. కోసిన వరి మొదళ్లను నాలుగు రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. అనంతరం ఒక్కో రకం వరి వేర్వేరు కల్లాలు చేసి టార్పాలీన్‌లలో వరి మొదలు వేసి ట్రాక్టర్ల ద్వారా నూర్పిడి చేయాలి. ఒక రకానికి చెందిన వరి ధాన్యాన్ని మరో రకం వరి ధానయంతో కలపోద్దు. పొలం వద్దే సరైన గ్రేడింగ్ చేయాలి. గడ్డిని తీసి వేసి గింజలన్నీ కుప్పగా పోసి గాలి పంకల సహాయంతో (తాలు గింజలు) నాణ్యత లేని గింజలు లేకుండా శుభ్రంగా తూర్పారా పట్టాలి. ధాన్యంలో 17 శాతం లోపు తేమ ఉండే వరకు ఆరబెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే మద్దతు ధర వచ్చే అవకాశాలు ఉంటాయి. హార్వేస్టర్‌తో కోత ద్వారా మొదటి సారి పోస్తే డబ్బాను వేరుగా పోయాలి. ఆ తరువాత కోసినవన్నీ ఒక చోట పోయాలి. ఇలా చేయడం వల్ల కల్తీ ప్రమాదం తప్పుతుంది. వడ్లను సిమెంట్ కల్లాలు లేదా టార్పాలిన్ షీట్లపై ఆరబెట్టాలి. రెండు, మూడు రోజులుగా బాగా ఎండేలా కాళ్లతో కలియదున్నాలి. పంట కోశాక సరిగ్గా ఆరబెట్టక పోతే గింజలు రంగు మారి పంట నాణ్యత తగ్గుతుంది. పంటను ఆరబెట్టే సమయంలో రాళ్లు, మట్టి పెల్లలు, చెత్తాచెదారం వంటి వ్యర్థ పదార్థాలు చేరకుండా జాగ్రత్త వహించాలి. నిలువ చేసే పక్షంలో గోనే సంచులను కింద వేయకుండా కవర్లు పరిచి లేదా బల్లలపై బస్తాలు నెట్లుగా వేయాలి. పురుగులు ఆశించకుండా లీటరు నీటికి 5 ఎంఎల్ మలాథియాన్ మందును కలిపి బస్తాలపై పిచికారి చేయాలి. ఎలుకల నుంచి రక్షించుకోవడానికి బస్తాల మధ్య జింక్ పాస్పేట్ ట్యాబెలెట్లు ఉంచాలి. ఒక రోజు తలుపులు పూర్తిగా మూసి వేసి గాలి చొరబడకుండా జాగత్త్ర వహించాలి. ఇలా చేయడంతో ఎలుకలు లేకుండా పోతాయి. మరుసటి రోజు నుంచి తలుపులు తీయొచ్చు.
నాణ్యత ప్రమాణాలు తప్పని సరి..
వరి ధాన్యం ఏ గ్రేడ్ రకం క్వింటాలుకు ప్రభుత్వం రూ.2,389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర దక్కాలంటే రైతులు ధాన్యంలో ఆణ్యత ప్రమాణాలు పాటించాలి. తేమ శాతం 17 శాతం లోబడి తాలు, ఒక శాతం మట్టి పెళ్లలు, రాళ్లు (ప్యాడైన రంగు, మారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం, పూర్తి కాని, ముడుచుకు పోయిన ధాన్యం, తక్కువ రకం మిశ్రమం, ఆరు శాతం లోబడి) లేకుండా చేసుకోవాలి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చేటప్పుడు రైతులు ఆధార్ కార్డు జిరాక్స్, భూమి పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, రైతుబంధుకు అనుసంధానమైన బ్యాంకు అకౌంట్ బుక్కు జిరాక్స్, ఆధార్ కార్డుకు అనుసంధానమైన ఫోన్ నంబర్లను వెంట తెచ్చుకోవాలి. కౌలు రైతులు సైతం ఆధార్ కార్డు, బ్యాంకు పాసు బుక్కులు, కౌలు ఇచ్చిన రైతు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌లతో పాటు ఆధార్ కార్డుకు అనుసంధానమైన ఫోన్ నంబర్, ఆయా మండలాల వ్యవసాయాధికా రులచేత జారీ చేయబడిన కౌలు సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.