ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటే చస్తాం
ABN , Publish Date - Apr 30 , 2025 | 01:01 AM
ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందే చస్తానని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేయగా, మరొకరు ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేశారు.
చండూరులో మహిళ నిరసన
తుంగతుర్తిలో వాటర్‌ట్యాంక్ ఎక్కి వ్యక్తి హల్‌చల్
ఉమ్మడి జిల్లాలో ఘటనలు
తుంగతుర్తిలో వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి
తుంగతుర్తి, చండూరు రూరల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందే చస్తానని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేయగా, మరొకరు ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేశారు. మంగళవారం సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని నల్లగొండ జిల్లా చండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న చండూరు మండలం నెర్మట గ్రామానికి చెందిన పాలడుగు ముత్తమ్మ మాట్లాడుతూ భర్త మృతితో 20 ఏళ్లుగా నెర్మట గ్రామంలోని తల్లిగారింటి వద్ద ఉంటూ కూలి పనిచేసుకొని బతుకుతున్నామని, తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలన్నారు. ‘‘ప్రభుత్వం ఏమి లేనోళ్లకు ఇళ్లు ఇయ్యమంటే భూములు, ఇళ్ళు ఉన్నోళ్లకే ఇస్తున్నారని, వాళ్ళు ఓటు వేస్తేనే గెలిచిండా ఈ ఎమ్మెల్యే.. మేము ఓటు వేయలేదా, ఇల్లు, భూమి ఏమి లేని నాకు ఇల్లు రాకపోతే పోయి ఆ ఎమ్మెల్యే ఇంటిముందే చస్తా’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన భయ్య కనకయ్య జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల ఇందిరమ్మ ఇంటికోసం గ్రామానికి వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల అధికారులు విడుదల చేసిన మొదటి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు రాలేదని ఉదయం 11 గంటల సమయంలో వాటర్ ట్యాంక్ ఎక్కాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్‌ఐ రుద్రక్రాంతికుమార్ సం ఘటనాస్థలానికి చేరుకొని బాధితుడికి నచ్చజెప్పి కిందికి దింపారు.