Saudi Accident Victims: మృతుల గుర్తింపు సవాలే!
ABN , Publish Date - Nov 19 , 2025 | 04:31 AM
సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమైన హైదరాబాదీల గుర్తింపు సవాలుగా మారింది.....
సౌదీ రోడ్డు ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు
44 మందిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు తప్పనిసరి
మదీనా చేరుకున్న మంత్రి అజారుద్దీన్ బృందం
గల్ఫ్‌ప్రతినిధి/రాంనగర్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమైన హైదరాబాదీల గుర్తింపు సవాలుగా మారింది. ఈ ఘటనలో 44 మంది మంటలంటుకొని పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. దీంతో డీఎన్‌ఏ పరీక్షల కోసం మృతుల కుటుంబ సభ్యులను సౌదీకి పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలోని బృందం మంగళవారం మదీనా చేరుకుంది. భారత కాన్సుల్ జనరల్ ఫహాద్ అహ్మద్ ఖాన్ సూరితో సమావేశమై చర్చించారు. సౌదీ అరేబియా ప్రభుత్వం కల్పించే సాధారణ బీమా పథకం కింద రోడ్డు ప్రమాద మృతులకు ఒక్కొక్కరికి లక్ష రియాళ్లు అంటే దాదాపు రూ.23 లక్షలు చెల్లిస్తారు. కానీ, దానికి మరణ ధ్రువీకరణ పత్రం కావాలి. ముందు మృతులను గుర్తిస్తే.. సౌదీ అధికారులు మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.
సౌదీ మసీదులో ప్రార్థనలు జరిపించాలి
సౌదీలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరేందుకు మదీనాలోని మసీదులో ప్రార్థనలు జరిపించాలని విద్యానగర్‌కు చెందిన మృ తుడు నసీరుద్దీన్ బావమరిది మహ్మద్ షాహిద్ కోరారు. సౌదీలో అధికారికంగా చివరి ప్రార్థనలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, నసీరుద్దీన్ కుటుంబ సభ్యులకు సంబంధించి ఏడుగురిని సౌదీకి తీసుకెళ్లారు.