Share News

Ibomma Ravi: నేనొక్కడినే!

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:40 AM

చట్టానికి దొరికితే తన పరిస్థితి ఏమిటో అన్నీ తెలిసే ఐబొమ్మ రవి భారీ ఎత్తున సినిమాల పైరసీకి పాల్పడ్డాడని పోలీసులు గ్రహించారు....

Ibomma Ravi: నేనొక్కడినే!

  • నన్నేమైనా చేసుకోండి... పట్టించుకొనే వారులేరు

  • లక్ష జీతం వచ్చినా ఇంట్లో నన్ను లెక్క చేయలేదు

  • ఎలాగైనా సంపాదించాలని ఇందులోకొచ్చా

  • పోలీసుల విచారణలో వెల్లడించిన ఐబొమ్మరవి

  • పది దేశాలలో విస్తరించిన ఐబొమ్మ నెట్వర్క్‌

  • 2 నెలలకు ఒక దేశంలో టీమ్‌తో మీటింగ్‌లు

  • డొమైన్‌ అడ్రస్‌ ఆధారంగా రవి ఉనికి గుర్తింపు

  • 20% సినిమాల నుంచి 80% బెట్టింగ్‌ నుంచి ఆదాయం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): చట్టానికి దొరికితే తన పరిస్థితి ఏమిటో అన్నీ తెలిసే ఐబొమ్మ రవి భారీ ఎత్తున సినిమాల పైరసీకి పాల్పడ్డాడని పోలీసులు గ్రహించారు. ‘‘నేను సింగిల్‌, ఏక్‌ నిరంజన్‌. నాకు ఏం జరిగినా పట్టించుకునే వారు లేరు. నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అని విచారణ సందర్భంగా పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఏం చేసినా డబ్బు కోసమే చేసినట్లుచెప్పాడు. గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన రవికి నెలంతా కష్టపడితే లక్ష రూపాయల వరకు జీతం వచ్చేదట. వచ్చే ఆదాయం ఎటూ సరిపోక పోవడం, ఇంట్లో భార్య, అత్తామామలు తన సంపాదనను చులకన చేసి మాట్లాడటంతో సులభంగా పెద్ద మొత్తం సంపాదించాలని నిర్ణయించుకున్నాడట. తనకున్న ఐటీ పరిజ్ఞానంతో సినిమా పైరసీపై దృష్టి సారించినట్లు వెల్లడించాడు. ఆన్‌లైన్‌లో ఐబొమ్మ ప్రాచుర్యంపొందిన తర్వాత యాడ్‌ ఏజెన్సీల ద్వారా రవికి రూ.లక్షల్లో డబ్బు వచ్చిపడింది. ఆ డబ్బుతో ఎంజాయ్‌ చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. తల్లిదండ్రులతో గానీ, భార్యతో గానీ, స్నేహితులతో గానీ రవికి ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు గుర్తించారు. అమెరికాలో ఒక డొమైన్‌, అమీర్‌పేటలో ఒక డొమైన్‌ను రవి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడని, వాటి టెక్నికల్‌ ఎవిడెన్స్‌తోనే అతనిపై నెలల తరబడి నిఘా పెట్టి ఎట్టకేలకు శనివారం అరెస్టు చేశారు. రవి వద్ద లభ్యమైన డేటాను విశ్లేషించినపుడు మొత్తం 10 దేశాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు తేలింది. ప్రతీ రెండు నెలలకు ఒక్కో దేశానికి వెళ్లి అక్కడ తనకు సహకరించే టీమ్‌ సభ్యులతో సమావేశం నిర్వహించేవాడని గుర్తించారు. ఇండియాకు వచ్చినపుడు కూకట్‌పల్లిలోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకొని వెళ్లేవాడు. శనివారం ఫ్రాన్స్‌ నుంచి హైదరాబాద్‌కు రవి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు కూకట్‌పల్లిలోని నివాసంలో ఉండగా ఇంటిని చుట్టుముట్టారు. తలుపు తట్టగా డోర్‌ తీయలేదు. రెండు గంటల పాటు శ్రమించినా తలుపులు తెరవలేదు. డోర్‌ బద్దలు కొట్టాలని నిర్ణయించుకొని గట్టిగా తన్నడంతో పరిస్థితి అర్థమై రవి డోర్‌ తీశాడు.


విదేశీయులపైనా కేసులు..

రవి నెట్‌వర్క్‌లో ఎక్కువగా విదేశీయులే ఉన్నారు. అతనితో సంబంధాలు ఉన్నట్లు తేలితే విదేశీయులపైనా కేసులు నమోదు చేస్తామని డీసీపీ కవిత తెలిపారు. రవిని వారం రోజులపాటు పోలీస్‌ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. న్యాయస్థానం నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేసింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న రవి బ్యారక్‌లో తోటి ఖైదీలతో మాట్లాడకుండా ముభావంగా ఉన్నట్లు తెలిసింది. 3 రోజులుగారవిని కలిసేందుకు కుటుంబ సభ్యులెవరూ రాలేదు. తనను కలిసేందుకు ఇద్దరు న్యాయవాదులు రాగా కలిసేందుకు నిరాకరించారు.. తన స్నేహితుడు పంపించే న్యాయవాదులతోనే మాట్లాడతానని స్పష్టం చేశాడు.

విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నందునే అరెస్టు

రవి సినిమా పరిశ్రమపైనే బెదిరింపులకు పాల్పడ్డాడని, విదేశీ పౌరసత్వం ఉన్న రవి దేశం దాటి పారిపోయే అవకాశంతో పాటు ఆధారాలను నాశనం చేసే అవకాశం ఉండటంతో అరెస్ట్‌ చేశామని సైబర్‌ క్రైం పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రవి ఐబొమ్మ, బప్పం పేర్లతో భిన్నమైన ఎక్స్‌టెన్షన్లతో అనేక వెబ్‌స్లైనను, బప్పం యాప్‌లను నిర్వహించేవాడు. సినీ పరిశ్రమ వాళ్లపైనా బెదిరింపులకు దిగాడు. ‘‘నాపై ఫోకస్‌ ఆపండి లేదంటే మీపై ఫోకస్‌ చేయాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించాడు. అమెరికా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌లో సర్వర్లను పెట్టాడు. 110 డొమైన్సును కొన్నాడు. కొత్త సినిమాల పైరసీకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నాడు. ఐబొమ్మ, బప్పం టీవీల ద్వారా లక్షల మంది వ్యూయర్స్‌ను 1విన్‌, 1ఎక్స్‌ బెట్‌ వంటి అక్రమ బెట్టింగ్‌ వేదికలకు మళ్లించాడు. వందల కోట్ల రూపాయలు క్రిప్టో కరెన్సీ రూపంలో అతనికి బదిలీ అయ్యిందని పోలీసులు గుర్తించారు. రవిపై ఐటీ చట్టం, కాపీరైట్‌ చట్టంతో పాటు బీఎ్‌సఎస్‌ 318(4), 319(2), 336(3), 340(2) సెక్షన్‌లు చేర్చారు. దొంగసొత్తు దాచుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మోసానికి వాడటం, కంప్యూటర్‌తో ఫ్రాడ్‌కు పాల్పడటం, అనుమతి లేకున్నా లోపలికి వచ్చి నష్టం కలిగించడం ఈ సెక్షన్ల కిందకు వచ్చే నేరాలు.


సజ్జనార్‌ నుంచి వివరాలు కోరిన ఈడీ

రవి కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) దృష్టి సారించింది. రవి కేసు వివరాలను ఇవ్వాలని హైదరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు ఈడీ అధికారులు లేఖ రాశారు. అతడి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.3.5 కోట్లను ఇప్పటికే స్తంభింపజేశారు. కరేబియన్‌ దీవుల్లో పౌరసత్వం కోసం రూ.80 లక్షలు ఖర్చుపెట్టినట్లు గుర్తించారు. పైరసీ సినిమాల ఆదాయం 20 శాతం మాత్రమేనని, 80 శాతం బెట్టింగ్‌ ఆదాయమేనని గ్రహించారు. విదేశీ ఖాతాల నుంచి కొంత, క్రిప్టో కరెన్సీ రూపంలో కొంత వచ్చిందని, హవాలా మార్గంలోనూ చెల్లింపులు జరిగాయని గుర్తించారు. తమకు లభించిన సమాచారం మొత్తం ఈడీకి పంపిస్తున్నామని సజ్జనార్‌ తెలిపారు. క్రిప్టో కరెన్సీ వాలెట్ల నుంచి రవి భారతీయ బ్యాంకు ఎన్నారై ఖాతాకు ఖాతాకు నిధులు అందాయని గుర్తించారు.

Updated Date - Nov 19 , 2025 | 04:40 AM