IAS Smita Sabharwal: జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కొట్టివేయండి
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:55 AM
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను కొట్టివేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ హైకోర్టు...
హైకోర్టులో ఐఏఎస్ స్మితా సభర్వాల్ పిటిషన్
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను కొట్టివేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించిన ఏ నిర్ణయాలతోనూ తనకు సంబంధం లేదని, నిర్ణయ ప్రక్రియలో తాను భాగస్వామిని కూడా కాలేదని పేర్కొన్నారు. బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి స్మితా సభర్వాల్ కీలక పాత్ర పోషించారని, సీఎంవో స్పెషల్ సెక్రటరీగా నిర్మాణాలను పర్యవేక్షించారని కమిషన్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. బ్యారేజీల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు సైతం ఇచ్చారని తెలిపింది. కీలకమైన దస్ర్తాలను అప్పటి మంత్రివర్గం ముందు పెట్టకుండా బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే కమిషన్ తనకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వడానికి ముందు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 8-బీ, 8-సీ ప్రకారం నోటీసులు ఇవ్వలేదని ఆమె తెలిపారు. తన వాదన వినలేదని అందువల్ల కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు.