IAS Promotion: ఐఏఎస్ పదోన్నతుల జాబితా వివరాలు అసమగ్రం
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:44 AM
తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులు(ఎస్‌సీఎస్) 21 మందికి ఐఏఎస్ పదోన్నతి కల్పించేందుకుగాను.. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల జాబితాలో వివరాలు సమగ్రంగా లేవని యూ నియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పేర్కొంది...
21 మందికిగాను 15 మంది అభ్యర్థుల వివరాలు సరిగా లేవు వారికి సంబంధించిన ఏసీఆర్‌లు, కేసుల వివరాలు పంపండి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యూపీఎస్సీ కార్యదర్శి నుంచి నోట్
సీనియారిటీ ధ్రువీకరించిన కమిటీ వివరాలు, సభ్యుల ఫోన్ నంబర్లు,
కార్యదర్శి స్థాయి అధికారి సంతకంతో ధ్రువపత్రం ఇవ్వాలని స్పష్టీకరణ
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులు(ఎస్‌సీఎస్) 21 మందికి ఐఏఎస్ పదోన్నతి కల్పించేందుకుగాను.. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల జాబితాలో వివరాలు సమగ్రంగా లేవని యూ నియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పేర్కొంది. జాబితాలోని లోపాలను ఎత్తి చూపుతూ పూర్తి వివరాలతో జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శికి యూపీఎస్సీ కార్యదర్శి నుంచి నోట్ వచ్చింది. 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి ఎంపిక జాబితా సిద్ధం చేసేందుకు నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పంపిన 21 మంది రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించిన ప్రతిపాదనల్లో.. 15 మంది వివరాలు అసంపూర్తిగా, అసమగ్రంగా ఉన్నాయని నోట్‌లో తెలిపింది. వారికి సంబంధించిన ఏసీఆర్‌లు (యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు), కేసుల వివరాలు సమగ్రంగా లేవని.. క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన వివరా లూ పూర్తిగా ఇవ్వలేదని.. కొందరిపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు అసమగ్రంగా ఉన్నాయని.. తప్పనిసరిగా ఇవ్వాల్సిన ధ్రువీకరణ పత్రాలు అందించలేదని పేర్కొంది. సీనియారిటీ జాబితా ధ్రువీకరణలో స్పష్టత లేదని, దానిపై కార్యదర్శి స్థాయి అధికారి సంతకం చేసిన ధ్రువపత్రం జత చేయలేదని తెలిపింది. కోర్టు కేసుల వివరాలు కూడా ప్రతిపాదిత జాబితాలో లేవని, క్యాట్ తీర్పుల ప్రభావం ఉన్నప్పటికీ ఆ వివరాలను జాబితాలో పొందుపరచలేదని అభ్యంతరం తెలిపింది. పదోన్నతులకు అవసరమైన ధ్రువపత్రాలు (నో రిలేషన్ సర్టిఫికెట్, సెలక్షన్ కమిటీ వివరాలు) ఇవ్వాలని కోరింది.
ఇవ్వకుంటే ఆగే ముప్పు..
రాష్ట్రప్రభుత్వం తక్షణమే ఈ లోపాలన్నీ సరిదిద్ది.. అధికారుల ఏసీఆర్‌లు, క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన వివరాలు, క్రిమినల్ కేసుల వివరాలు, ధ్రువపత్రాలు అందించాలని కోరింది. అలాగే.. 21 మంది అభ్యర్థులను ఎంపిక చేసిన కమిటీ వివరాలను, కమిటీలో ఉన్నవారి వివరాలు, వారి ఫోన్ నంబర్లు కూడా పంపాలని ప్రభుత్వానికి పంపిన నోట్‌లో యూపీఎస్సీ స్పష్టం చేసింది. జాబితాలో ఉన్న వారిలో రాష్ట్ర సివిల్ సర్వీసెస్ కోటా, నాన్ సివిల్ సర్వీసెస్ కోటా వివరాలను అందించాలని కోరింది. ఇవేమీ ఇవ్వకపోతే 2022, 2023, 2024 ఐఏఎస్ పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయే అవకాశం ఉంది.
ఇవీ అభ్యంతరాలు..
ఎ.వెంకటరెడ్డి అనే అధికారి మీద 2010లో విధించిన సెన్షూర్ పెనాల్టీ ఉత్తర్వుల కాపీలను జత చేయలేదని యూపీఎస్సీ తెలిపింది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయా? చార్జిషీట్ దాఖలైందా లేదా అన్న వివరాలు తెలపలేదని పేర్కొంది. 11-10-2016 నుంచి 3-1-2018 వరకు, 13-3-2018 నుంచి 5-9-2018, 6-9-2018 నుంచి 12-2-2020, 1-4-2022 నుంచి 31-3-2023 కాలానికి సంబంధించిన రివ్యూ అథారిటీ (ఆర్‌ఏ) ధ్రువపత్రం, యాక్సెప్టింగ్ అథారిటీ(ఏఏ) రిమార్కులు లేవని తెలిపింది.
సి.నాగేశ్‌పై క్రిమినల్ కేసుందని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం.. చార్జిషీట్ వేసిందీ లేనిదీ చెప్పలేదని తెలిపింది. 27-1-2024న ఆయన్ను తిరిగి సర్వీ్‌సలోకి తీసుకున్న ఉత్తర్వుల కాపీ జత చేయలేదని, 2015-18 ఏసీఆర్‌లు ఇవ్వలేదని తెలిపింది.
ఎ.రాజా అనే అధికారికి సంబంధించి 2018-2023 మధ్య కొన్ని ఏసీఆర్‌లు లేవని, 1-4-2018 నుంచి 30-7-2019, 1-4-2019 నుంచి 4-7-2019, 27-11-2022 నుంచి 31-3-2023 నడుమ ఆర్‌ఏ, ఏఏ రిమార్కులు ఇవ్వలేదని తెలిపింది.
భవానీ శంకర్‌కు సంబంధించి.. 2018-2024 మధ్య పలు ఏసీఆర్‌లు లేవని, ఆర్‌ఏ, ఏఏ రిమార్కులు జత చేయలేదని, కొన్నింటికి కేవలం కౌం టర్ సంతకాలు మాత్రమే ఉన్నాయని పేర్కొంది.
సి.వీరారెడ్డికి సంబంధించి ఆర్‌ఏ, ఏఏ లేవని, పి. శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఏసీఆర్‌లు లేవని, వేణుగోపాల్‌కు సంబంధించి ఆర్‌ఏ, ఏఏ రిమార్కులు లేవని, ఎ.భాస్కర్‌రావుకు సంబంధించి ఆర్‌ఏ రిమార్కులు లేవని, ఎం.దావీద్‌కు ఆర్‌ఏ, ఏఏ రిమార్కులు ఇవ్వలేదని, అబ్దుల్ హమీద్‌కు ఆర్‌ఏ, ఏఏలు జత చేయలేదని, కె.కిమ్యానాయిక్‌కు ఏసీఆర్ పార్ట్-1 లేదని తెలిపింది. కె. గంగాధర్ ఏసీఆర్‌లు లేవని, బి. నర్సింగ్‌కు సంబంధించి 2017-2022 మధ్య ఏసీఆర్‌లు లేవని, ఆర్‌ఏ, ఏఏ రిమార్కులు ఇవ్వలేదని పేర్కొంది.