Share News

Family Dispute: ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:10 AM

ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వారి నివాసంలో...

Family Dispute: ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

  • 9 నెలల కిందట మహానందిలో ప్రేమ వివాహం

  • ఇటీవల అత్తింటి నుంచి తల్లిదండ్రుల వద్దకు..

  • ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య

నంద్యాల/తాడేపల్లి/మంగళగిరి సిటీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వారి నివాసంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆత్మహత్య చేసుకున్న యువతిది కులాంతర ప్రేమ వివాహం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమార్తె ఆత్మహత్యకు భర్త మోసం, అత్తింటి వేధింపులే కారణమని బాధిత తల్లిదండ్రులు చెబుతుండగా.. వారే తన భార్యను హత్య చేశారని, దీనిపై తనకు అనుమానాలున్నాయంటూ యువతి భర్త ఆరోపిస్తున్నాడు. తాడేపల్లి పోలీసులు యువతి తల్లి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన చిన్నరాముడు, లక్ష్మీభాయి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె మాధురి సాహితి బాయి (25). ఐఏఎస్‌ హోదాలో ఉన్న చిన్నరాముడు ప్రస్తుతం రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ కార్యదర్శిగా గుంటూరులో పనిచేస్తూ.. తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె మాధురి బుగ్గానిపల్లె గ్రామానికి చెందిన బోయ రాజేశ్‌ నాయుడు అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ ఏడాది మార్చి 5న నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో వివాహం చేసుకొన్నారు. మాఽధురి తల్లిదండ్రులు రాజేశ్‌ తమ కుమార్తెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధురి తన భర్తతో వెళ్తానని చెప్పడంతో పోలీసులు ఆమెను భర్త వెంట పంపించారు. మార్చి 7న యువతి తల్లిదండ్రుల ఆమోదంతో బేతంచెర్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహ రిజిస్ర్టేషన్‌ కూడా చేయించుకున్నారు. మాధురి మూడు నెలల క్రితం ‘మిమ్నల్ని చూడాలని ఉంది. మీతో ఉండాలని ఉంది’ అంటూ తల్లిదండ్రులకు మెసేజ్‌ పంపింది. దీంతో తల్లిదండ్రులు బేతంచెర్ల మండలం సిమెంట్‌ నగర్‌కు వచ్చారు. ఇరువర్గాలు బేతంచెర్ల పోలీసులను సెప్టెంబరు 3న ఆశ్రయించాయి. పోలీసులు ఇరువర్గాల సమక్షంలో మాధురిని విచారించి ఆమె ఇష్టపూర్వకంగానే తల్లిదండ్రులకు అప్పగించారు. ఈక్రమంలో ఆమె ఆదివారం తాడేపల్లిలోని తన తండ్రి నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. కాగా, తమ కుమార్తెను రాజేశ్‌ నాయుడు ప్రేమ పేరుతో ట్రాప్‌ చేసి, పెళ్లి చేసుకొని వేధింపులకు గురిచేశాడని, ఆ వేధింపులకు తాళలేకే బలవన్మరణానికి పాల్పడిందని మాధురి తల్లిదండ్రులు లక్ష్మీభాయి, చిన్నరాముడు ఆరోపించారు. తన భార్య మాధురి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ రాజేశ్‌ నాయుడు సోమవారం నంద్యాల ఎస్పీని ఆశ్రయించారు. తన భార్యను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారంటూ ఆరోపించారు.

Updated Date - Dec 02 , 2025 | 05:10 AM