Government Hospitals: మేమూ వస్తాం పదా..సర్కారు దవాఖానకు!
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:03 AM
సర్కారు దవాఖానాలకు ఐఏఎస్ అధికారులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులకు ‘బ్రాండ్ అంబాసిడర్లు’గా ఐఏఎ్‌సలు
తాజాగా ఐఏఎస్ అధికారి గౌతమ్ సతీమణికి గాంధీలో ప్రసవం
గతంలో పెద్దపల్లి, కొత్తగూడెం కలెక్టర్ల సతీమణులూ ‘సర్కారీ’లోనే..
ప్రభుత్వ ఆస్పత్రిలోనే సర్జరీ చేయించుకున్న కరీంనగర్ కలెక్టర్
హైదరాబాద్ /అడ్డగుట్ట, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సర్కారు దవాఖానాలకు ఐఏఎస్ అధికారులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సోమవారం ఐఏఎస్ అధికారి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తన సతీమణి గౌతమిని ప్రసవం కోసం సికింద్రాబాద్‌లోని గాంఽధీ ఆస్పత్రిలో చేర్పించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కావడంతో గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ శోభ నేతృత్వంలోని వైద్య బృందం కష్టపడి సిజేరియన్ డెలివరీ చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డలిద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఖమ్మం జిల్లాలో కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనూ గౌతమ్ తన భార్య తొలి కాన్పును అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించారు. ఒక్క గౌతమ్ అనే కాకుండా జిల్లాల్లో పలువురు కలెక్టర్లు కూడా తమతో పాటు కుటుంబ సభ్యులకూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయిస్తున్నారు. కొద్దిరోజుల కిందట పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తన సతీమణిని ప్రసవం కోసం గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తన సతీమణికి కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు చేయించారు. ఇటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అనారోగ్యంతో బాధపడుతూ.. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలోని చెవి, ముక్కు, గొంతు విభాగంలో చేరారు. వైద్యుల సూచన మేరకు అక్కడే ముక్కుకు శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు.
సర్కారు దవాఖానలపై నమ్మకం పెంచేందుకే..
ఇటీవల ఉన్నతాధికారులు వరుసగా సర్కారు దవాఖానాలకు క్యూ కడుతుండటం.. అందరినీ ఆలోచనలో పడేసింది. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచేందుకు వారంతా ఆస్పత్రులకు వస్తున్నారని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క ఐఎఎస్ అధికారులే కాకుండా న్యాయమూర్తులు సైతం నిమ్స్, గాంధీ వంటి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాజంలో ఉన్నత హోదాలో ఉన్న వారు సర్కారు వైద్యాన్ని నమ్మి వస్తుండటంతో ప్రజల్లోనూ వాటిపై విశ్వాసం పెరుగుతోంది. పేద, మధ్య తరగతి వర్గాల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం రెట్టింపవుతోంది. ఐఏఎస్ అధికారులు వరుసగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి వైద్యం చేయించుకుంటుండటంతో ఒక రకంగా వారే సర్కారు దవాఖానాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతోందని వెల్లడించాయి.
మొదట్నుంచీ గాంధీలోనే పరీక్షలు..
ఐఏఎస్ అధికారి గౌతమ్ సతీమణి గౌతమి ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక.. మొదట్నుంచీ గాంధీలోనే రెగ్యులర్ చెకప్స్ చేయించుకున్నారు. 36 వారాల వైద్య పరీక్షల తర్వాత ఆమెను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నాం. గౌతమికి తొలి కాన్పు కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగింది. ఆమెది హైరిస్క్ ప్రెగ్నెన్సీ. మా వైద్యుల బృందం ఎంతో శ్రమించి సిజేరియన్ చేసి డెలివరీ చేసింది. గాంఽధీ ఆస్పత్రికి ఇటువంటి కేసులు వారానికి ఐదారు వస్తాయి. అయితే ఇంతకంటే ఎంతో హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకూ డెలివరీ చేశాం. ప్రభుత్వ వైద్యంపై ఎంతో నమ్మకంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. గాంఽధీ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను అందిస్తున్నాం..
- డాక్టర్ ఎన్.వాణి,
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్