Telangana High Court: నాగారం భూదాన్ భూముల కేసు..ఐఏఎస్, ఐపీఎస్‌లపై తీవ్ర ఆరోపణలున్నాయ్!
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:14 AM
నాగారం భూదాన్ భూముల విషయంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎ్‌సలకు, ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది...
ప్రతివాదులు కొందరు కీలక పదవుల్లో ఉన్నారు.. ఆ భూములపై ఇచ్చిన స్టేను తొలగించం
వాటిని నిషేధిత జాబితాలోనే ఉంచాలి: హైకోర్టు
స్టే ఎత్తివేయాలన్న ఐఏఎస్, ఐపీఎ్‌సల పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): నాగారం భూదాన్ భూముల విషయంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎ్‌సలకు, ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో ని సర్వేనంబరు 181, 194, 195లోని భూదాన్/ప్రభుత్వ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలన్న ఉత్తర్వులను ఎత్తివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలన్న ఉత్తర్వుల్ని ఎత్తేయాలని కోరుతూ పలువురు ఐఏఎస్, ఐపీఎ్‌సలు, ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు శు క్రవారం కొట్టివేసింది. ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని, వాటిలో ఎలాంటి లావాదేవీలు, నిర్మాణాలు చేపట్టరాదంటూ ఏప్రిల్ 24న ఇచ్చిన ఉత్తర్వులు అలాగే కొనసాగుతాయని స్పష్టంచేసింది. నాగారంలోని భూదాన్ భూముల రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి పాస్‌పుస్తకాలు జారీచేశారని, ఆ భూములను ఏపీ, తెలంగాణలకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి బినామీల పేరిట రిజిస్ట్రేషన్లు చేశారని.. ఈ అక్రమాలపై ఫిర్యా దు చేసినా పట్టించుకోవడంలేదని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామానికి చెందిన బిర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై ఈ ఏడాది ఏప్రిల్ 4న విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం.. వివాదాస్పద భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులు ఎత్తివేయాలని కోరుతూ పలువురు ఐఏఎస్, ఐపీఎ్‌సలు, ఈఐపీఎల్ సంస్థ హైకోర్టులో వెకేట్ స్టే అప్లికేషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ‘‘నాగారంలోని సర్వే నంబరు 181, 194, 195లో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నాయని, దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఈ పిటిషన్ దాఖలైంది. ప్రాథమికంగా పరిశీలిస్తే ఈ కేసులో ప్రతివాదులు గా ఉన్న ఐఏఎస్, ఐపీఎ్‌సలతోపాటు రెవెన్యూ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
అనధికార ప్రతివాదులుగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి బంధువులు.. నవీన్‌మిట్టల్, జ్ఞానముద్ర (సోమేశ్‌కుమార్), తాటిపర్తి పావనీరావు, ఐశ్వర్య రాజ్ (వికా్‌సరాజ్), వసుంధరా సిన్హా (అంజనీ సిన్హా), ఎస్.హరీశ్, అమోయ్‌కుమార్, యశస్విని, అనురాగ్ శర్మ, ఇందూరావు, ఎన్.మధుసూదన్, బూసిరెడ్డి రాహుల్, సవ్యసాచి ప్రతాప్ సింగ్, బత్తుల హేమలత (బి.శివధర్‌రెడ్డి), బీకే రాహుల్ హెగ్డే, లెంకల సుబ్బారాయుడు, అజయ్ జైన్, దివ్యశ్రీ, పేర్ల వరుణ్, రేణూగోయెల్ (జితేందర్‌కుమార్ గోయెల్), తరుణ్ జోషి, రాజర్షి షా, రవిగుప్తా, రేఖా షరా్‌ఫ(ఉమేశ్ షరాఫ్), స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా, తోట శ్రీనివా్‌సరావు, ముదిరెడ్డి నితేశ్‌రెడ్డి (ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి), ఎంఎం భగవత్, దండ రాధిక (వీబీ కమలాసన్‌రెడ్డి), రీటా సుల్తానియా (సందీప్ కుమార్ సుల్తానియా), నందినీ మాన్, ఓం అనిరుధ్, అజిత్‌కుమార్ మహంతి తదితరులు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారు. 56వ ప్రతివాదిగా ఉన్న డి.అమోయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ రిట్ పిటిషన్‌లో పూర్తిస్థాయి విచారణలో మాత్రమే తెలుస్తాయి’’ అని హైకోర్టు పేర్కొంది. ఐఏఎస్, ఐపీఎ్‌సలు, ఈఐపీఎల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. తదుపరి విచారణ కోసం బిర్ల మల్లేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను వాయిదా వేసింది. భూమి కొనుగోలు చేసినందున, తమ వాదన కూడా వినాలని పేర్కొం టూ ఎస్.చిరంజీవిరాజు, మరో 28 మంది దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లను అనుమతించింది.
విచారణ కమిషన్ వేయాలన్న పిటిషన్ కొట్టివేత
నాగారంలో రికార్డులు తారుమారు చేసి, భూము లు అక్రమంగా బదిలీ చేసుకున్న వ్యవహారంపై విచారణ కమిషన్‌ను నియమించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది. తనకు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న నాగారంలోని సర్వే నంబరు 194, 195లోని 10.17 ఎకరాల భూమిని అక్రమంగా బదిలీ చేసుకున్నారని.. రెవెన్యూ రికార్డుల్లో తన పేరు తొలగించారని.. ఈ అక్రమ భూబదిలీలపై విచారణ కమిషన్ నియమించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని పేర్కొంటూ వడిత్య రాములు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం.. విచారణ కమిషన్ అవసరంలేదని పేర్కొం టూ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, సర్వే నంబరు 194లో ఉన్న ప్రభుత్వ భూములకు అక్రమంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీచేశారని.. వాటికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియ కాపీలు అందజేసేలా ఆదేశాలు జారీచేయాలని పేర్కొంటూ బిర్ల మల్లేశ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను సైతం హైకోర్టు కొట్టేసింది.