Share News

TPCC Chief Mahesh Kumar Goud: మంత్రి పదవి కావాలని నేను అడగలేదు

ABN , Publish Date - Nov 13 , 2025 | 04:21 AM

సీఎం రేవంత్‌రెడ్డికి, తనకు మధ్య గ్యాప్‌ లేదని, సమన్వయంతో కలిసి పని చేసుకుంటున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ చెప్పారు. మంత్రివర్గంలో చేరాలని తానేమీ ఆరాట పడట్లేదని....

TPCC Chief Mahesh Kumar Goud: మంత్రి పదవి కావాలని నేను అడగలేదు

  • టీపీసీసీ అధ్యక్షుడిగా చాలా సంతోషంగా ఉన్నా

  • సీఎం రేవంత్‌, నాకు మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదు

  • జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయం

  • మరో పదేళ్ల పాటు మా ప్రభుత్వానికి ఢోకా లేదు

  • మీడియాతో చిట్‌చాట్‌లో మహేశ్‌గౌడ్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డికి, తనకు మధ్య గ్యాప్‌ లేదని, సమన్వయంతో కలిసి పని చేసుకుంటున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ చెప్పారు. మంత్రివర్గంలో చేరాలని తానేమీ ఆరాట పడట్లేదని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తనకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. టీపీసీసీ చీఫ్‌గా చాలా సంతోషంగా ఉన్నానని, మంత్రి పదవి కావాలని తానెప్పుడూ అడగలేదని వెల్లడించారు. క్యాబినెట్‌ విస్తరణ సంగతి పార్టీ అధిష్ఠానం, సీఎం రేవంత్‌ చూసుకుంటారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మరో సారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో సానుకూలత బాగా పెరిగిందని, మరో పదేళ్లు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి అధిష్ఠానం కసరత్తు పూర్తయిందని, ఏ క్షణమైనా ప్రకటన వెలువడవచ్చని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. నవీన్‌యాదవ్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం తమకు కలిసి వచ్చిందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోలింగ్‌ శాతం మరి కొంత పెరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో రిగ్గింగ్‌కు పాల్పడడం సాధ్యమే కాదని, ఓడిపోతున్నామన్న బాధతో బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ చట్టబద్ధంగా కల్పించాలని తాము ప్రయత్నిస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోందని ఆరోపించారు. బిహార్‌లో మహాఘట్‌బంధన్‌ కూటమి గెలుస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 04:21 AM