I Bomma One: ఐ బొమ్మవన్ వచ్చింది!
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:35 AM
పైరసీ సినిమాల వెబ్‌సైట్లు ఐ బొమ్మ, బప్పం టీవీలను పోలీసులు నిలిపివేయించారు. వాటి నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ, నాలుగు రోజుల్లోనే ఐ బొమ్మ స్థానంలో ఐ బొమ్మవన్ వచ్చేసింది! రవిని అరెస్ట్ చేసిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో..
రవి అరె్‌స్టతో ఆగని పైరసీ.. ముందే చెప్పిన సజ్జనార్, ఆనంద్
ఆ సైట్‌లో రివ్యూలే ఉన్నాయి..
సినిమాలేవీ ఓపెన్ కావట్లేదు: పోలీసులు
నేనెవరినీ మోసం చేయలేదు..!
మొదటి రోజు పోలీస్ కస్టడీలో రవి
హైదరాబాద్ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పైరసీ సినిమాల వెబ్‌సైట్లు ఐ బొమ్మ, బప్పం టీవీలను పోలీసులు నిలిపివేయించారు. వాటి నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ, నాలుగు రోజుల్లోనే ఐ బొమ్మ స్థానంలో ఐ బొమ్మవన్ వచ్చేసింది! రవిని అరెస్ట్ చేసిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో.. ఇది పైరసీకి అంతం కాదని సీపీ సజ్జనార్‌తో పాటు ఇతర అధికారులు స్పష్టంగా చెప్పారు. ‘హ్యాకర్ల హ్యాకింగ్ కొనసాగుతూనే ఉంటుంది. ఒకరు పోతే మరొకరు వస్తారు. అది కూడా మరింత అధునాతనంగా ఉంటుంది’ అని హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి సీవీ ఆనంద్ కూడా పేర్కొన్నారు. రవి అరెస్టయిన నాలుగు రోజుల్లోనే ఈ విషయం నిజమని పైరసీకారులు నిరూపించారు. గురువారం ఐ బొమ్మవన్ అందుబాటులోకి వచ్చింది. ఐ బొమ్మ తరహాలోనే ఐ బొమ్మవన్‌లో కూడా పైరసీ చేసిన కొత్త సినిమాలు కనిపించాయి. కాగా, ఐ బొమ్మవన్‌పై సైబర్ క్రైం అధికారులు వివరణ ఇచ్చారు. అందులో సినిమాల రివ్యూలు మాత్రమే ఉన్నాయన్నారు. ఎటువంటి సినిమాలు ఓపెన్ కావడం లేదని తెలిపారు. ఇప్పటికే ఐ బొమ్మ, బప్పం వెబ్‌సైట్లను బ్లాక్ చేయించామని.. వేరే వెబ్‌సైట్ల ద్వారా పైరసీకి పాల్పడితే వాటిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎవరినీ మోసం చేయలేదు..
తానెవరినీ మోసం చేయలేదని ఇమ్మడి రవి చెప్పాడు. సినిమాలను పైరసీ చేయలేదని, అక్రమంగా ప్రజల సొమ్ము తినలేదని పోలీసుల విచారణలో సమాధానమిచ్చాడు. సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వంటి కేసుల్లో నగర సైబర్ క్రైం అధికారులు రవిని అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలిరోజైన గురువారం చంచల్‌గూడ జైలు నుంచి తీసుకొచ్చి, వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సైబర్ క్రైం కార్యాలయంలో రవిని ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది? ఎన్ని దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నాడు? సర్వర్లు ఏయే దేశాల్లో ఉన్నాయి? వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు? అన్న విషయాలపై కూపీ లాగారు. పోలీసు విచారణలో ఎక్కడా బెదరకుండా జవాబులిచ్చిన రవి.. కొన్ని ప్రశ్నలకు మాత్రం బదులివ్వలేదని తెలిసింది. దాదాపు 20 వేల సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. అందుకు వినియోగించిన టెక్నాలజీ, విదేశాల్లో సర్వర్లు వంటి కోణాల్లో ప్రశ్నించారు.
రవి కేసు ఉచితంగా వాదిస్తా
విశాఖపట్నం జిల్లా పెదగదిలి సాలిపేటలో ఉంటున్న రవి తండ్రి చినఅప్పారావును న్యాయవాది సలీమ్ కలిశారు. ఈ కేసును ఉచితంగా వాదించి, రవిని బయటకు తీసుకొస్తానని చెప్పినట్టు అప్పారావు తెలిపారు. కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని సలీమ్ కోరగా, తన ఆరోగ్యం బాగుండనందున కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదంటూ సంతకం పెట్టేందుకు నిరాకరించినట్లు చెప్పారు. కేసు వాదించి, రవిని బయటకు తీసుకురావాలంటే అతని వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సలీమ్ సూచించారని తెలిపారు.