జన్మనిచ్చిన గ్రామానికి రుణపడి ఉంటా
ABN , Publish Date - May 05 , 2025 | 12:12 AM
జన్మనిచ్చిన గ్రామం తాటిపాములకు రుణపడి ఉంటానని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
తిరుమలగిరి రూరల్, మే 4 (ఆంధ్రజ్యోతి): జన్మనిచ్చిన గ్రామం తాటిపాములకు రుణపడి ఉంటానని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని తాటిపాముల గ్రామంలో రూ.20 కోట్టతో నిర్మించే యశ్వంతాపూర్ వాగుపై చెక్‌డ్యాం, రెండు వరుసల వంతెన, రూ.కోటితో సీసీ రోడ్లు, రూ.కోటితో డ్రైనేజీ నిర్మాణానికి రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ తేజ్‌సనందాలాల్ పవార్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం వాగుపై రూ. 20 కోట్లతో చెక్‌డ్యాం నిర్మిస్తున్నామని, దేవాదుల చివరి ప్యాకేజీ నుంచి చెన్నూరు రిజర్వాయర్ నుంచి సాగునీరు తాటిపాముల మీదుగా తిరుమలగిరికి తరలిస్తామన్నారు. తన చిన్నతనంలో ఆ వాగుపై ఆడుకున్నామని జ్ఞాపకాలను గుర్తుచేశారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ తాటిపాముల గ్రామానికి చెందిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పైలెట్‌గా అప్పుడు ప్రాణాలు లెక్కచేయకుండా దేశ రక్షణకోసం పోరాడగా, ఇప్పుడు రైతుల సంక్షేమం కోసం, పంట సాగుకోసం సాగు నీరించే నీటి పారుదలశాఖ మంత్రిగా, పండిన ధాన్యం కొనే పౌర సరఫరాలశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూ, ప్రతి పేదోడి కంచంలో సన్న బియ్యం పెడుతున్నారన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు సుధీర్‌రెడ్డి, ఎస్పీ కె. నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు పాల్గొన్నారు.
రవాణా రంగ సమస్యలు పరిష్కరించాలి
కోదాడ: సింగిల్ పర్మిట్ విధానం అమలు కాకపోవడంతో, రెండు రాష్ట్రాలలో రవాణా రంగం పలు సమస్యలను ఎదుర్కొంటుందని వాటిని పరిష్కారించాలని లారీ ఓనర్స్ రాష్ట్ర అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, పలువురు లారీ ఓనర్లు కోరారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు. సింగిల్ పర్మిట్ విధానం అమలుకాకపోవటంతో ఏపీకి వెళ్లడానికి తెలంగాణ లారీ యజమానులు అదనపు పన్ను భారం భరించాల్సి వస్తోందన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు సమస్యను పరిష్కరించి, పన్ను భారం తగ్గేలా చూడాలని కోరారు.