Share News

Hydropower Boom: జల విద్యుత్తుతో జెన్‌కోకు 2 వేల కోట్లు!

ABN , Publish Date - Oct 22 , 2025 | 05:32 AM

రాష్ట్రంలో జల విద్యుత్తు ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరుగుతోంది. ఈ సీజన్‌లో రిజర్వాయర్లకు భారీ వరద వచ్చింది. ఆ జలాలను ఒడిసిపట్టుకొని విద్యుత్తును...

Hydropower Boom: జల విద్యుత్తుతో జెన్‌కోకు 2 వేల కోట్లు!

  • రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి

  • ఇప్పటికే 5 వేల మిలియన్‌ యూనిట్లు

  • సీజన్‌ ముగిసేనాటికి సరికొత్త రికార్డు ఖాయం!

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో జల విద్యుత్తు ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరుగుతోంది. ఈ సీజన్‌లో రిజర్వాయర్లకు భారీ వరద వచ్చింది. ఆ జలాలను ఒడిసిపట్టుకొని విద్యుత్తును ఉత్పత్తి చేయడంతో ఇప్పటిదాకా తెలంగాణ జెన్‌కో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. కరెంటు యూనిట్‌ రూ.4 చొప్పున డిస్కమ్‌లకు విక్రయిస్తోంది. తెలంగాణ జెన్‌కో ఈ నెల 19న అర్ధరాత్రి నాటికి 5 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రికార్డు స్థాయిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6831 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి జరగ్గా.. ఆ రికార్డును ప్రస్తుత సంవత్సరంలో దాటే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో తొమ్మిది ప్రాజెక్టుల వద్ద 2441.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్కేంద్రాలు ఉండగా.. అందులో కృష్ణా నదిపై 2371.6 మెగావాట్ల కేంద్రాలు ఉన్నాయి. గోదావరిపై 70.2 మెగావాట్ల కేంద్రాలున్నాయి. కృష్ణా బేసిన్‌లో ప్రతి నీటి చుక్క కాసులు కురిపిస్తోంది.

రికార్డుల దిశగా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2019-20లో 3963 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా.. 2020-21లో 3667 మిలియన్‌ యూనిట్ల (శ్రీశైలం ప్రమాదంతో)ను, 2021-22లో అత్యధికంగా 5655 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేశారు. 2022-23లో ఏకంగా 6831 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేశారు. 2020 ఆగస్టు 20న శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఆ కేంద్రంలోని ఒక యూనిట్‌ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌లో ఐదేళ్లుగా ఉత్పత్తి నిలిచిపోవడంతో 2 వేల మిలియన్‌ యూనిట్లకు పైగా ఉత్పత్తిపై ప్రభావం పడినట్లయింది. కాగా, రాష్ట్రంలో ఈ నెల 20 నాటికిజల, థర్మల్‌ విద్యుత్తు కలిపి 20 వేల మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేశారు. దీంతో సీజన్‌ ముగిసేనాటికి జలవిద్యుత్తు ఉత్పాదన కొత్త రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - Oct 22 , 2025 | 05:32 AM