Hydra Protection: ఆలయ భూములకు హైడ్రా రక్షణ
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:47 AM
ఖాళీ స్థలాలు ఎక్కడ కనిపించినా కబ్జాల పాలవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూములన్న తేడా లేకుండా ఆక్రమణలకు గురవుతున్నాయి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూముల అప్పగింతకు ప్రతిపాదన
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ
ఆలయ భూముల కబ్జాలు, పరిరక్షణ చర్యలపై చర్చ
త్వరలో సీఎం ముందుకు ఫైల్.. ఆమోదం రాగానే రంగంలోకి..
రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ భూములు అన్యాక్రాంతం
స్వాధీనం కోసం కొనసాగుతున్న ప్రత్యేక డ్రైవ్
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఖాళీ స్థలాలు ఎక్కడ కనిపించినా కబ్జాల పాలవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూములన్న తేడా లేకుండా ఆక్రమణలకు గురవుతున్నాయి. అందులోనూ ఆలయాల భూములు, స్థలాల ఆక్రమణ విచ్చలవిడిగా సాగుతోంది. ఈ క్రమంలో దేవుడి భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువుల ఆక్రమణలను సమర్థవంతంగా అడ్డుకుంటున్న ‘హైడ్రా’కు దేవాదాయ భూముల పరిరక్షణ బాధ్యతలు అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తులు, ట్రస్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆలయాలు కాకుండా దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాలు, మఠాలు మొత్తం 12,645 ఉన్నాయి. వాటికి 84,195 ఎకరాల వరకు భూమి ఉంది. అయితే ఇందులో నాలుగో వంతు భూములు, స్థలాలు కబ్జాల పాలైనట్టు అంచనా. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులు.. ఇప్పటివరకు 3వేల ఎకరాలకుపైగా దేవాదాయ భూములు, స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆలయాల భూముల పరిరక్షణ బాధ్యతను హైడ్రాకు అప్పగించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులు సచివాలయంలో సమావేశమయ్యారు. అన్యాక్రాంతమైన ఆలయ భూములు, పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. విలువైన దేవాదాయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటి రక్షణకు హైడ్రా సాయం కావాలని రంగనాథ్‌ను మంత్రి కోరారు. ప్రభుత్వ అనుమతి లేనిదే హైడ్రా నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేదని మంత్రికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. దీనితో హైదరాబాద్‌లో ఆలయ భూముల పరిస్థితిని, హైడ్రా సేవల అవసరాన్ని సీఎం రేవంత్‌రెడ్డికి వివరించేందుకు మంత్రి సిద్ధమైనట్టు తెలిసింది. సీఎం ఆమోదం రాగానే హైడ్రా రంగంలోకి దిగనుంది.