Share News

Hydra successfully protected: 500 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

ABN , Publish Date - Sep 14 , 2025 | 04:37 AM

హైడ్రా మరోసారి కబ్జాదారులపై కొరడా ఝుళిపించింది. శనివారం శంషాబాద్‌లో రూ.500 కోట్ల విలువైన 12 ఎకరాల సర్కారు స్థలాన్ని కబ్జాదారుల చెర నుంచి కాపాడింది..

Hydra successfully protected: 500 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

  • శంషాబాద్‌లో ఇంటర్మీడియట్‌ బోర్డు భూమి కబ్జా

  • ఫిర్యాదులు రావడంతో క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన

  • షెడ్లూ, ప్రహారీ తొలగింపు

  • 12 ఎకరాల భూమిని కాపాడి బోర్డుల ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): హైడ్రా మరోసారి కబ్జాదారులపై కొరడా ఝుళిపించింది. శనివారం శంషాబాద్‌లో రూ.500 కోట్ల విలువైన 12 ఎకరాల సర్కారు స్థలాన్ని కబ్జాదారుల చెర నుంచి కాపాడింది. ఆక్రమణలు తొలగించడమేకాకుండా ‘ఇది ప్రభుత్వ భూమి.. హైడ్రా పరిరక్షించింది’ అని రాసి ఉన్న బోర్డులు ఏర్పాటు చేసింది. హైడ్రా వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శాతంరాయి గ్రామంలోని సర్వే నంబర్‌ 17లో 12 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. దీనిపైస్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయిలో అధికారులు సమగ్ర పరిశీలన చేశారు. అది ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకొని షెడ్లు, చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీ తొలగించింది. 12 ఎకరాల్లో ఎకరంమేర నివాసాలు, ఆలయం, మసీదు ఉండగా.. వాటి జోలికి వెళ్లలేదని సంస్థ స్పష్టం చేసింది. శాతంరాయిలోని 12 ఎకరాల భూమిని 2011లో ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ బోర్డుకు కేటాయించింది. భూమి తమదని స్థానిక నేత ఒకరు, అనీష్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ బోర్డులు ఏర్పాటు చేసింది. ఆ భూమిలో వారు నిర్మాణాలకు ప్రయత్నించారు. షెడ్లు, ప్రహారీ నిర్మించారు. వీటి ఫొటోలను స్థానికులు హైడ్రాకు పంపారు. ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు కూడా భూమి కబ్జాపై ఫిర్యాదు చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా బృందం అది సర్కారు స్థలంగా తేల్చింది. రాళ్లు, రప్పలతో వ్యవసాయ యోగ్యం కాని భూమిలో వ్యవసాయం చేస్తున్నామని, అస్‌ఫజాహీ పైగా వారసుల నుంచి కొన్నామని కబ్జాదారులు చెబుతున్నారు. అయితే శంషాబాద్‌ పరిధిలో పైగా కుటుంబాలకు చెందిన భూములులేవని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. దీంతో కబ్జాదారుల వాదనలో వాస్తవం లేదన్న నిర్ణయానికి వచ్చారు. మరో ప్రాంతంలో ఉన్న భూములను శాతంరాయిలో చూపి కబ్జా చేయాలని చూశారని హైడ్రా పేర్కొంది. అనీష్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు చెందిన శ్రీపాద దేశ్‌ పాండే పలు భూముల వివాదాల్లో ఉన్నట్టు హైడ్రాకు మరిన్ని ఫిర్యాదులు అందాయి.

Updated Date - Sep 14 , 2025 | 04:37 AM