HYDRA Action: 750 కోట్ల స్థలం కబ్జా
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:35 AM
బ్జాదారుల చెర నుంచి వందల కోట్ల రూపాయల విలువైన భూములకు హైడ్రా అధికారులు విముక్తి కల్పించారు. ప్రభుత్వ భూములు, పార్కుల్లోని ఆక్రమణలపై...
నకిలీ సేల్‌డీడ్ సృష్టించి బంజారాహిల్స్‌లో 5 ఎకరాల భూమి ఆక్రమణ
కోర్టులో కేసు నడుస్తుండగానే.. ఫెన్సింగ్, షెడ్ల నిర్మాణం
రంగంలోకి హైడ్రా.. ఆక్రమణలు తొలగించి భూమి స్వాధీనం
గాజులరామారం, మేడ్చల్, తట్టిఅన్నారంలోనూ ఆక్రమణలు నేలమట్టం
ఆ భూముల విలువ రూ.350 కోట్లు!
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్/అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కబ్జాదారుల చెర నుంచి వందల కోట్ల రూపాయల విలువైన భూములకు హైడ్రా అధికారులు విముక్తి కల్పించారు. ప్రభుత్వ భూములు, పార్కుల్లోని ఆక్రమణలపై కొరడా ఝుళిపించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల విలువైన 5 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గాజుల రామారం, మేడ్చల్, తట్టిఅన్నారంలలో మరో రూ.350 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమణల చెర నుంచి విడిపించారు. మొత్తం రూ.1100 కోట్ల విలువైన భూములను కాపాడారు. షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని సర్వే నంబర్ 403లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని పార్థసారథి అనే వ్యక్తి కబ్జా చేశాడు. రూ.750 కోట్ల విలువైన ఈ భూమికి 403/52 సర్వే నంబర్ పేరిట నకిలీ అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ సృష్టించాడు. పలుమార్లు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు పెట్టారు. వాటిని తొలగించి మరీ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు బౌన్సర్లు, వేట కుక్కలను కాపలాగా ఉంచాడు. దీనికి సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పార్థసారథిపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కోర్టులో వివాదం ఉండగానే మొత్తం భూమిని అధీనంలోకి తీసుకొని షెడ్లు నిర్మించాడు. ఆ షెడ్లలో బౌన్సర్లు, ఇతరులు మద్యం సేవించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అలాగే జలమండలికి కేటాయించిన 1.20 ఎకరాల భూమిని కూడా వాడుకోకుండా అడ్డుపడుతున్నాడన్న ఫిర్యాదు కూడా హైడ్రాకు అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. రికార్డులను పరిశీలించి, 5 ఎకరాలను ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. భారీ బందోబస్తు నడుమ రూ.750 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు.
కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. గాజులరామారంలోని మహదేవపురంలో పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన 3.50 ఎకరాల స్థలాన్ని కొందరు ఆక్రమించారు. మేడ్చల్ ఏజీ ఆఫీస్ ఉద్యోగులకు చెందిన హౌసింగ్ సొసైటీ లే అవుట్‌లో పార్కులు, రోడ్లు, ఇతర అవసరాలకు ఉద్దేశించిన 3 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఈ రెండు ప్రాంతాల్లోని భూమి విలువ రూ.350 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా వర్గాలు తెలిపాయి. ఈ భూముల్లోని ఆక్రమణలు తొలగించిన అధికారులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తట్టిఅన్నారంలోని సర్వే నంబర్ 76/ఏలో కొన్నేళ్ల క్రితం సుమారు 9.24 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో సుమారు 680 చదరపు గజాల స్థలాన్ని పార్కు కోసం వదిలేశారు. ప్రస్తుతం ఈ లేఅవుట్‌లో లక్ష్మీగణపతి కాలనీ వెలసింది. పార్కు స్థలంలో 2016లో ఓ గదితోపాటు చుట్టూ ప్రహరీ నిర్మించిన ఓ వ్యక్తి 270 చ.గ. స్థలం తనదని చెప్పడంతో కాలనీవాసులు హైడ్రాను ఆశ్రయించారు. ఇరు వర్గాల డాక్యుమెంట్లను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. అది పార్కు స్థలంగా గుర్తించారు. ఆయన ఆదేశాల మేరకు గది, ప్రహరీ కూల్చి.. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పార్కు స్థలం విలువ రూ.2.50 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.