Share News

Apartment Demolished in Ameenpur: ఐదంతస్తుల భవనం కూల్చివేత

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:30 AM

సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల సరిహద్దులోని మియాపూర్‌ పరిధిలోని హుడాకు చెందిన భూమిలో రూ.20 కోట్ల విలువైన 800 గజాల స్థలాన్ని కబ్జా చేసి...

Apartment Demolished in Ameenpur: ఐదంతస్తుల భవనం కూల్చివేత

  • ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం.. హైడ్రా ఉక్కుపాదం

  • నకిలీ పత్రాలతో అనుమతులు

  • నిర్మాణం పూర్తి.. కూల్చివేసిన హైడ్రా

అమీన్‌పూర్‌, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల సరిహద్దులోని మియాపూర్‌ పరిధిలోని హుడాకు చెందిన భూమిలో రూ.20 కోట్ల విలువైన 800 గజాల స్థలాన్ని కబ్జా చేసి, తప్పుడు పత్రాలు సృష్టించి ఐదంతస్తుల భారీ అపార్ట్‌మెంట్‌ను నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. శనివారం ఆ భవనాన్ని హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చివేయించారు. అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో పీజేఆర్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీ పక్కనే.. మేడ్చల్‌ జిల్లా శేరిలింగంపల్లి మండలానికి చెందిన సర్వే నంబరు 101లో ప్రభుత్వ భూములు విస్తరించి ఉన్నాయి. పీజేఆర్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ ప్రభుత్వ భూమిలోని స్థలానికి.. అమీన్‌పూర్‌కు చెందిన 307, 308 పట్టా నంబర్లు వేసి డాక్యుమెంట్లను తయారు చేశారు. సదరు ప్లాటుకు హెచ్‌ఎండీఏ ఎల్‌ఆర్‌ఎస్‌ తుది ప్రొసీడింగ్‌ జారీ చేసిందని మరో ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. తప్పుడు పత్రాలను అమీన్‌పూర్‌ మునిసిపాలిటీకి సమర్పించి టీఎ్‌సబీపాస్‌ ద్వారా ఐదంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు పొందారు. అనంతరం ఐదంతస్తుల భారీ అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. అందులో కొన్ని ప్లాట్ల అమ్మకం కూడా పూర్తిచేసినట్లు తెలిసింది. కాగా కూల్చివేతల సందర్భంగా హైడ్రా సిబ్బందిని అడ్డుకునేందుకు నిర్మాణదారులు యత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు.


మణికొండలో 300 కోట్ల భూమి..

మణికొండలో కబ్జాల చెరలో ఉన్న ప్రభుత్వ భూమికి, మరో రెండు పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. తద్వారా సుమారు రూ.300 కోట్ల విలువైన భూమిని కాపాడింది. మణికొండలో పంచవటి కాలనీలో వోప్టర్న్‌ ప్లాజాకు చేరువలో ఎకరా భూమికి పత్రాలు లేకుండా తమ పూర్వీకులదని చెప్పి కబ్జా చేసిన వారిని హైడ్రా ఖాళీ చేయించింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ వెస్టర్న్‌ ప్లాజాకు చెందిన వారు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కమిషనర్‌ రంగనాథ్‌ అదేశాలతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్‌వేసి, ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. మణికొండ వెంకటేశ్వర కాలనీలో 1600 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. 1992లో లేఔట్‌ వేసినప్పుడు పార్కులకు కేటాయించిన ఈ స్థలంలో కొంతమంది ఆక్రమణలకు పాల్పడ్డారు. పార్కు స్థలంలో బై నంబర్లు వేసుకొని కబ్జాలు చేశారంటూ హైడ్రా ప్రజావాణికి కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా 1600 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని పార్కు స్థలంగా పేర్కొంటూ బోర్డులు పెట్టింది. దీని విలువ 25 కోట్లు ఉంటుందని అంచనా. తిరుమల గిరిహిల్స్‌లో 6150 గజాల పార్కు స్థలం కబ్జాకు గురికాగా, తాత్కలికంగా వేసిన షెడ్డులు కాంపౌండ్‌ వాల్‌ తొలగించి హైడ్రా ఫెన్సింగ్‌ వేసి బోర్డులు ఏర్పాటు చేసింది. మార్కెట్‌లో ఈ భూమి విలువ రూ. 120 కోట్లు వరకూ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Nov 02 , 2025 | 04:30 AM