Hyderabad Youth Shot: అమెరికాలో దుండగుల కాల్పుల్లో..హైదరాబాద్ యువకుడి మృతి
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:24 AM
అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసి.. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న హైదరాబాద్‌కు చెందిన యువకుడు అక్కడ దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు...
బీడీఎస్ చేసి ఉన్నత చదువులకు డాలస్ వెళ్లిన చంద్రశేఖర్
వనస్థలిపురం/హైదరాబాద్, అక్టోబరు 4(ఆంధ్ర జ్యోతి): అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసి.. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న హైదరాబాద్‌కు చెందిన యువకుడు అక్కడ దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అతను ఉన్నతస్థాయికి వెళతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లి.. తన కుమారుడు దుండగుల తూటాలకు బలైపోయాడని తెలిసి తల్లడిల్లిపోతోంది. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీచర్స్ కాలనీ ఫేజ్-2కు చెందిన పోలే చంద్రశేఖర్ (27) కొత్తపేట పాణినీయా డెంటల్ కళాశాలలో బీడీఎస్ పూర్తి చేశాడు. ఎంఎస్ చేసేందుకు 2023లో అమెరికాలోని డల్లా్‌సకు వెళ్లాడు. ఆరు నెలల క్రితం అతని చదువు పూర్తయింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. కొంతకాలంగా అక్కడ ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పార్ట్-టైం ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌పై దాడి చేసి.. విధుల్లో ఉన్న చంద్రశేఖర్‌ను కాల్చి చంపారు. అతని స్నేహితులు శనివారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చంద్రశేఖర్ మరణవార్త విని తల్లి సునీత, ఇద్దరు సోదరులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతని తండ్రి జగన్ మోహన్ నాలుగేళ్ల కిత్రం మృతిచెందారు. అమెరికాలో దుండుగల కాల్పుల్లో చంద్రశేఖర్ మృతిచెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అతని భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్థానిక నాయకులు పరామర్శించారు. బంగారు భవిష్యత్తు ఉన్న చంద్రశేఖర్ మృతి కలచివేస్తోందని, అమెరికాలోని గన్ కల్చర్ తరచూ భారతీయులను బలి తీసుకుంటోందని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ తల్లి సునీత, సోదరుడు రాజ్ కిరణ్‌లతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలిపారు.