Road Accident in USA: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ యువకుడి మృతి
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:44 AM
అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని చంచల్‌గూడకు చెందిన షెరాజ్ మోహతాబ్ మహ్మద్ (25) ప్రాణాలు కోల్పోయాడు....
చాదర్‌ఘాట్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని చంచల్‌గూడకు చెందిన షెరాజ్ మోహతాబ్ మహ్మద్ (25) ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత ఉద్యోగావకాశాల కోసం ఇటీవలే అమెరికాకు వెళ్లిన షెరాజ్ మోహతాబ్ అకాలంగా మృతిచెందడం అందరినీ కలచివేసింది. షెరాజ్ తండ్రి అల్తాఫ్ మహ్మద్‌ఖాన్ (అల్తాఫ్ గోల్డీ) హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. కాగా కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. షెరాజ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. షెరాజ్ మరణ వార్తతో స్వస్థలం చంచల్‌గూడలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధువులు, స్నేహితులు అతడి నివాసానికి చేరుకుని షెరాజ్‌తో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కంటతడిపెట్టారు. మసీదులో నమాజ్ అనంతరం అతడి పేరుపై ముస్లిం షెరియా ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా గడిచిన 48 గంటల్లో అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పనిచేస్తున్న హైదరాబాద్ బీఎన్ రెడ్డినగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.