Drug Overdose: డ్రగ్స్ ఓవర్ డోస్.. యువకుడి మృతి!
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:27 AM
డ్రగ్స్ ఓవర్ డోస్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతి చెందిన యువకుడితో కలిసి ఉంటున్న...
ఓ స్నేహితుడు, ఇద్దరు యువతులతో కలిసిఓ అపార్టుమెంట్‌లో ఉంటున్న యువకుడు
లక్డీకాపూల్‌లో డ్రగ్స్ తెచ్చుకున్నట్లు నిర్ధారణ
అతడి స్నేహితుల్లో ఇద్దరికీ డ్రగ్స్ పాజిటివ్?
హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ ఓవర్ డోస్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతి చెందిన యువకుడితో కలిసి ఉంటున్న స్నేహితుల్లో ఇద్దరికీ డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. రాజేంద్రనగర్ సర్కిల్‌లోని కెన్వర్త్ అపార్ట్‌మెంట్స్ ఫ్లాట్ నంబర్-805లో జహనూమకు చెందిన సెల్‌ఫోన్ మెకానిక్ మహ్మద్ అహ్మద్ (26) నివాసం ఉంటున్నాడు. అతనితోపాటు అత్తాపూర్ చింతల్‌మెట్‌కు చెందిన టైల్స్ పనులు చేసే సయ్యద్ బిన్‌సలామ్ (23), నగరానికి చెందిన యువతి షేక్ జారా, కోల్‌కతాకు చెందిన మొమతా బిస్వాస్ కలిసి (కోలివింగ్) ఉంటున్నారు. బుధవారం ఉదయం అహ్మద్ లక్డీకాపూల్ వెళ్లి చిన్న ప్యాకెట్‌లో డ్రగ్స్ తెచ్చుకున్నాడు. రాత్రి డ్రగ్స్ తీసుకొని పడుకోగా, అర్థరాత్రి 1:30 గంటలకు మరణించాడు. డ్రగ్స్ ఓవర్‌డోస్ కావడం వల్లే అతడు మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు నిర్వహించిన పరీక్షల్లో అతడి స్నేహితుడు సయ్యద్ బిన్ సలామ్, ఓ యువతి సైతం డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఈ మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఎందుకు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.