Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ 8 వరసల రహదారి.. ఫిబ్రవరిలో పనులు ప్రారంభం!
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:17 AM
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65)ని 8 వరసలుగా విస్తరించే పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని రాష్ట్ర రోడ్లు...
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65)ని 8 వరసలుగా విస్తరించే పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణను కలిపే ఈ ప్రధాన రహదారిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే రోడ్లలో ఇది కూడా ఒకటని తెలిపారు. ఎన్‌హెచ్-65పై ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్లు గుర్తించి ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీని కలిసినప్పుడు ఈ అంశాన్ని గుర్తుచేశానని, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రమాద రహిత రహదారిని అందుబాటులోకి తెస్తామని చెప్పినట్లు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యతతో హైదరాబాద్-విజయవాడ రహదారిని నిర్మిస్తామని గడ్కరీ చెప్పారన్నారు. ఈ 8 వరసల రహదారి పనులు పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 2గంటల్లో చేరుకోవచ్చని మంత్రి చెప్పారు. అదేక్రమంలో భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి 230కి.మీ. గ్రీన్ ఫీల్డ్ హైవే పట్ల కూడా కేంద్రమంత్రి గడ్కరీ సానుకూలంగా ఉన్నారన్నారు. డీపీఆర్, అంచనాల రూపకల్పన త్వరలో పూర్తవుతాయని, గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు.