Highway Expansion: హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు రూ.10వేల కోట్లు
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:11 AM
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఎన్‌హెచ్ 65 ని 6 వరుసలుగా విస్తరించడానికి గాను డీపీఆర్ తయారీని నవంబరు మొదటి లేదా రెండో వారంలోగా పూర్తి చేయాలని అధికారులు....
ఆంధోల్ మైసమ్మ గుడి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దాకా
ఆరు లేన్ల వెడల్పు.. 231.32 కిలోమీటర్ల పొడవుతో హైవే విస్తరణ
ఒక్కో కి.మీ.కి 44.92 కోట్ల వ్యయం.. ప్రాథమిక డీపీఆర్‌లో వెల్లడి
నవంబరు రెండో వారానికి తుది డీపీఆర్.. మార్చి నాటికి టెండర్లు
హైవే విస్తరణలో భాగంగా ఎన్ని చెట్లు, విద్యుత్ స్తంభాలు తొలగించాలన్న వివరాలు ఇవ్వాలని ఆయా శాఖలకు ఆదేశాలు
మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా వివరాల కోసం ఆరా
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65)ని 6 వరుసలుగా విస్తరించడానికి గాను డీపీఆర్ తయారీని నవంబరు మొదటి లేదా రెండో వారంలోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. డీపీఆర్‌ను నవంబర్‌లో పూర్తిచేసి, మార్చి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారికవర్గాలు తెలిపాయి. హైవేను తెలంగాణ పరిధిలోని దండుమల్కాపూర్ దగ్గరున్న ఆంధోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ పట్టణంలో ఉన్న కనకదుర్గమ్మ గుడి వరకు 231.32కి.మీ మేర 6 వరుసలుగా విస్తరించనున్నారు. హైవే వెంట కొన్ని కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, వెహికల్ అండర్‌పా్‌సలు నిర్మించనున్నారు. ఈ రోడ్డు విస్తరణ కోసం రూ.10,391.53 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా. ఇందులో నిర్మాణ వ్యయం రూ.6,775.47 కోట్లు కాగా, మరో రూ.3,616.06 కోట్లు వివిధ అవసరాలకు కావాల్సి ఉందని తేల్చారు. దీని ప్రకారం రోడ్డు విస్తరణకు ఒక్కో కిలోమీటర్‌కు రూ.44.92 కోట్ల చొప్పున నిధులను వెచ్చించనున్నారు. ఇక రహదారి విస్తరణ కోసం ఏపీ పరిధిలో సుమారు 162 హెక్టార్ల భూమిని కొత్తగా సేకరించాలని, ఇందుకోసం రూ.1,414 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని తేల్చారు. కాగా, హైవేపై 33చోట్ల మేజర్ జంక్షన్లు, 105చోట్ల మైనర్ జంక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒకచోట మేజర్ బ్రిడ్జి, 22చోట్ల మైనర్ బ్రిడ్జిలు, 4 కొత్త ఫ్లై ఓవర్లు, వెహికల్ అండర్‌పా్‌స/వెహికల్ ఓవర్ పాస్‌లు కలిపి 17, చిన్న చిన్న వాహనాలు వెళ్లడానికి, జంతువుల కోసం కూడా కొన్ని చోట్ల అండర్‌పా్‌సలను నిర్మించనున్నారు. 94చోట్ల ప్రయాణికుల విశ్రాంతి ప్రాంతాలు, 16 చోట్ల బస్ షెల్టర్‌లను ఏర్పాటుచేయనున్నారు. ఏపీ పరిధిలో రెండు చోట్ల కొత్త బైపా్‌సలను నిర్మించనున్నారు. కాగా రహదారి విస్తరణలో 22.5 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు హైవే విస్తరణకు సంబంధించిన ప్రాథమికడీపీఆర్ వివరాలు ఆంధ్రజ్యోతికి లభించాయి.
హైవే మంజూరు సమయంలోనే భూసేకరణ
మంగళవారం రోడ్లు-భవనాల శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ కీలక ఉన్నతాధికారులు పలు ప్రభుత్వశాఖలతో సమావేశం నిర్వహించారు. రహదారి విస్తరణ కోసం మార్గ మధ్యలో ఎన్ని విద్యుత్ లైన్లు, స్థంబాలు, చెట్లు, మొక్కలను తొలగించాల్సి వస్తోంది, రైల్వే క్రాసింగ్‌లు, కొత్తగా ఏర్పాటు చేయాల్సిన పలు సౌకర్యాల వివరాలన్నింటినీ అక్టోబరు చివరి వారంలోగా ఇవ్వాలని పలు శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. రహదారి వెంట ఇతర మౌలిక సదుపాయాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపైన కూడా వివరాలను సమగ్రంగా ఇవ్వాలని ఆయా ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. అక్టోబరు చివరి వారంలోగా ఈ వివరాలన్నీ అందగానే డీపీఆర్ పూర్తవనుంది. అనంతరం ఆ డీపీఆర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించనున్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లేన్లుగా విస్తరించేందుకు అవసరమైన డీపీఆర్ రూపకల్పన బాధ్యతను భోపాల్‌కు చెందిన కంపెనీ దక్కించుకుంది. హైవేను మంజూరు చేసిన సమయంలోనే 6 వరుసల విస్తరణకు అవసరమయ్యే భూమిని సేకరించారు. అయితే కొత్తగా ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాలకు కొన్ని చోట్ల భూసేకరణ అవసరమవుతున్నట్టు తెలిసింది. ఏపీ- తెలంగాణ సరిహద్దు అయిన కోదాడ నియోజకవర్గంలోని రామాపురం క్రాస్‌రోడ్డు దగ్గర ఒక వెహికల్ అండర్‌పా్‌సను నిర్మించనున్నారు.