Share News

Breast Cancer Cases: రొమ్ము క్యాన్సర్‌ రాజధానిగా హైదరాబాద్‌!

ABN , Publish Date - Oct 31 , 2025 | 02:49 AM

ఒకప్పుడు అరుదుగా కనిపించే రొమ్ము క్యాన్సర్‌ కేసుల సంఖ్య ఇటీవలికాలంలో పెరుగుతోంది. మరీ ముఖ్యంగా.. ఈ విషయంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోందని స్టార్‌ ఆస్పత్రి మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ సాయినాథ్‌ వివరించారు...

Breast Cancer Cases: రొమ్ము క్యాన్సర్‌ రాజధానిగా హైదరాబాద్‌!

  • సగటున దేశంలోనే అత్యధిక కేసులు ఇక్కడే

  • జాతీయ సగటు లక్షకు 26.6 కేసులు.. హైదరాబాద్‌ సగటు 54 కేసులు

  • తర్వాతి స్థానాల్లో చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె

  • ఆలస్య వివాహాలు, ఆలస్య ప్రసవాలు, పిల్లలకు ఎక్కువకాలం పాలు

  • ఇవ్వకపోవడం, అధిక బరువు, వాయుకాలుష్యం.. ప్రధాన కారణాలు

  • స్టార్‌ ఆస్పత్రి మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ సాయినాథ్‌ వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు అరుదుగా కనిపించే రొమ్ము క్యాన్సర్‌ కేసుల సంఖ్య ఇటీవలికాలంలో పెరుగుతోంది. మరీ ముఖ్యంగా.. ఈ విషయంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోందని స్టార్‌ ఆస్పత్రి మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ సాయినాథ్‌ వివరించారు. దేశంలో రొమ్ము క్యాన్సర్‌ఫై జరిగిన పలు అధ్యయనాలు, మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితమైన అధ్యయన నివేదికలను పరిశీలించి ఆయన పలు కీలక అంశాలను, గణాంకాలను వెల్లడించారు. అమెరికాలో గడిచిన రెండు దశాబ్దాలుగా రొమ్ము క్యాన్సర్‌ కేసుల రేటు స్థిరంగా ఉండగా.. భారత్‌లో 21 శాతం మేర పెరిగినట్టు ఆయన తెలిపారు. విదేశాల్లో 90 శాతం కేసుల్లో ఈ సమస్యను మొదటి దశలోనే గుర్తిస్తుండగా.. మన దగ్గర చాలా మంది 3, 4 దశల్లో ఉన్నప్పుడు ఆస్పత్రికి వస్తున్నారని.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతోందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. విదేశాల్లో స్ర్కీనింగ్‌ (పరీక్షలు) విస్తృతంగా జరుగుతున్నాయని, మన దగ్గర చాలా తక్కువగా జరగడమే ఈ ఆలస్యానికి కారణమని పేర్కొన్నారు. ఆయన తెలిపిన మరికొన్ని ముఖ్యాంశాలు..

  • దేశంలో రొమ్ము క్యాన్సర్‌ కేసులు 2000 సంవత్సరంలో ప్రతి లక్ష మందికిగాను సగటున 22 నమోదు కాగా.. 2022 నాటికి ఆ సగటు 26.6 కేసులకు చేరింది. అమెరికాలో ఈ సగటు 130 నుంచి 135 దాకా ఉంది. కానీ, రెండు దశాబ్దాలుగా అక్కడ స్థిరంగానే ఉంది. పెరగలేదు.

  • హైదరాబాద్‌లో ఈ సగటు 54. అంటే ప్రతి లక్ష మందికిగాను 54 కేసులు. జాతీయ సగటుతో పోలిస్తే ఇది దాదాపుగా రెట్టింపు. మన భాగ్యనగరం తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై (45.4), బెంగళూరు (46.7), ముంబై (34.4), ఢిల్లీ (38.6), పుణె (30) ఉన్నాయి.

  • 2022లో భారతదేశంలో 1,92,020 రొమ్ము క్యాన్సర్‌ కేసులు.. 98,337 మరణాలు నమోదయ్యాయి. ఇది దేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో 26.6 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది.

  • హైదరాబాద్‌లో రొమ్ముక్యాన్సర్‌ కేసుల సంఖ్య ప్రపంచంలోని పలు ప్రధాన నగరాలతో సమానంగా ఉంటోంది. ఆయా నగరాల్లో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ విస్తృతంగా జరుగుతుండగా.. ఇక్కడ చాలా తక్కువగా జరుగుతోంది. దీనివల్ల ఎక్కువ మంది మహిళల్లో ఈ సమస్య ఆలస్యంగా బయటపడుతోంది.


ఇవీ కారణాలు..

ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, ఆలస్యంగా పిల్లలను కనడం.. ఇటీవలికాలంలో పెరిగింది. శాస్త్రీయ ఆధారాలను బట్టి.. త్వరగా పిల్లలను కనే మహిళలతో పోలిస్తే, 30 ఏళ్ల తర్వాత బిడ్డలకు జన్మనిచ్చే మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ. 30 ఏళ్ల తర్వాత ప్రతి అదనపు సంవత్సరంతో ఈ ముప్పు పెరుగుతూ ఉంటుంది. యుక్తవయసులో గర్భం దాల్చితే రొమ్ము కణాలు త్వరగా పరిణతి చెంది క్యాన్సర్‌ కారకాల నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే.. పిల్లలకు ఎక్కువకాలం పాలివ్వడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే.. ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం బారినపడుతున్నవారి సంఖ్య భారతీయ నగరాల్లో బాగా పెరుగుతోంది. దీనివల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్‌ స్థాయులు పెరిగి.. రొమ్ము కణాలు ఆ హార్మోన్‌కు ఎక్స్‌పోజ్‌ అయ్యి క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉంది (పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఈస్ట్రోజెన్‌ స్థాయులు తగ్గుతాయి). అలాగే.. రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో కూడా ఊబకాయం వల్ల రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే 30-40ు పెరుగుతుంది. ఇక.. మారిన కాలమాన పరిస్థితుల రీత్యా చాలా మంది మహిళలు రాత్రి పూట ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల మెలటోనిన్‌ ఉత్పత్తి తగ్గి.. ఈస్ట్రోజెన్‌ స్థాయులు పెరుగుతున్నాయి. మెలటోనిన్‌ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల డీఎన్‌ఏ దెబ్బతిని క్యాన్సర్‌ బారిన పడే ముప్పు పెరుగుతోంది. వీటన్నింటికీ తోడు.. వాయుకాలుష్యం, మద్యపానం వంటివి కూడా రొమ్ము క్యాన్సర్‌ కేసుల సంఖ్యను పెంచుతున్నాయని డాక్టర్‌ సాయినాథ్‌ వెల్లడించారు. పీఎం 2.5 కణాలు (వాయు కాలుష్యం) రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని 8 శాతం పెంచుతాయని.. హైదరాబాద్‌లో వాహన కాలుష్యం, పరిశ్రమల వ్యర్థాలు ప్రమాద స్థాయిలో ఉన్నాయని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఇక.. దేశంలో సగటున 5 నుంచి 15 శాతం మంది మహిళలు ఆల్కహాల్‌ తీసుకుంటుండగా, హైదరాబాద్‌లో ఆ సగటు 6-7 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రోజుకు ఒక డ్రింక్‌ మాత్రమే తీసుకున్నా.. అది రొమ్ము క్యాన్సర్‌ ముప్పును 7-10ు పెంచుతుందని వివరించారు. అలాగే.. బీఆర్‌సీఎ1, బీఆర్‌సీఎ2 జన్యు ఉత్పరివర్తనాలు భారతీయ మహిళల్లో అధికంగా ఉన్నాయని... ఇవి రొమ్ము క్యాన్సర్‌ రిస్క్‌ను 55-70శాతం పెంచుతాయని చెప్పారు.


ట్రిపుల్‌ నెగిటివ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌

రొమ్ము క్యాన్సర్‌ల్లో ట్రిపుల్‌ నెగిటివ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ (టీఎన్‌బీసీ) అనేది అరుదైన రొమ్ము క్యాన్సర్‌ రకం. ఈ తరహా కేసులు ఇప్పుడు ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్‌ సాయినాథ్‌ తెలిపారు. మన దేశంలో ఈ కేసులు 30శాతం వరకు ఉన్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో పది శాతం టీఎన్‌బీసీ కేసులేనన్నారు.

భారత్‌లో స్ర్కీనింగ్‌ తక్కువ

భారతదేశంలో 45 ఏళ్లు దాటిన మహిళల్లో కేవలం 1.3ు మంది మాత్రమే రొమ్ము పరీక్షలు చేయించుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇది 2.05 శాతంగా ఉండగా, అమెరికాలో 70-84 ఽశాతంగా ఉంది. భారత్‌లో 50-70 శాతం క్యాన్సర్‌ కేసులను ఆఖరి దశల్లోనే గుర్తిస్తుండగా.. అమెరికాలో మాత్రం 66 శాతం కేసులు ప్రారంభ దశలోనే గుర్తించగలుగుతున్నారు. అక్కడ స్ర్కీనింగ్‌ ఎక్కువగా జరగడమే ఇందుకు కారణం. మన దగ్గర స్ర్కీనింగ్‌ తక్కువ జరుగుతోంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులను ప్రతి నెలా 15 నుంచి 20 మందిలో చూస్తున్నాను. ట్రిపుల్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

- డాక్టర్‌ సాయినాథ్‌, మెడికల్‌ అంకాజిస్టు, స్టార్‌ ఆస్పత్రి

Updated Date - Oct 31 , 2025 | 02:49 AM