First Womens Football Academy: హైదరాబాద్‌లో మహిళా ఫుట్‌బాల్ అకాడమీ
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:11 AM
దేశంలోనే తొలి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోరెండో మహిళా ఫుట్‌బాల్ అకాడమీ ఇదే కానుండటం విశేషం....
దేశంలో మొదటిది.. ప్రపంచంలో రెండోది
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటించనున్న ప్రభుత్వం
తెలంగాణ ఫిఫా-ఏఐఎ్‌ఫఎఫ్ ఏర్పాటు
సమ్మిట్‌కు పలు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్న మంత్రులు.. 4న పయనం
కేంద్ర మంత్రులకు ఎంపీలతో ఆహ్వానాలు
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోరెండో మహిళా ఫుట్‌బాల్ అకాడమీ ఇదే కానుండటం విశేషం. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ సందర్భంగా ఈ అకాడమీ ఏర్పాటుపై తెలంగాణ ఫిఫా - ఏఐఎ్‌ఫఎఫ్ (ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్) సంయుక్తంగా ప్రకటన చేయనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో రెండో పురుషుల ఫుట్‌బాల్ అకాడమీని కూడా తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నారని వెల్లడించాయి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణపై కూడా ఈ సందర్భంగా ప్రకటన వెలువడనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల సీఎంలను స్వయంగా కలిసి ఆహ్వానించే బాధ్యతలను మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు. ఎవరెవరు ఏయే రాష్ట్రానికి వెళ్లాలో సీఎం నిర్ణయించారు. ఈ నెల 4న మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఆహ్వాన లేఖలు అందించనున్నారు. ఢిల్లీ సీఎం, కేంద్ర మంత్రులకు తెలంగాణ ఎంపీలు ఆహ్వాన లేఖలు అందిస్తారు.
ఏ రాష్ట్రానికి ఏ మంత్రి..!
జమ్మూకశ్మీర్, గుజరాత్‌లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పంజాబ్, హరియాణాలకు దామోదరరాజనర్సింహ, ఆంధ్రప్రదేశ్, కేరళకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కర్ణాటక, తమిళనాడులకు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తరప్రదేశ్‌కు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, రాజస్థాన్‌కు పొన్నం ప్రభాకర్, ఛత్తీ్‌సగఢ్‌కు కొండా సురేఖ, పశ్చిమ బెంగాల్‌కు సీతక్క, మధ్యప్రదేశ్‌కు తుమ్మల నాగేశ్వరరావు, అస్సాంకు జూపల్లి కృష్ణారావు, బిహార్‌కు వివేక్ వెంకటస్వామి, ఒడిశాకు వాకిటి శ్రీహరి, హిమాచల్‌ప్రదేశ్‌కు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మహారాష్ట్రకు మహమ్మద్ అజారుద్దీన్, జార్ఖండ్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు.
అతిథులకు గుర్తుండిపోయే బహుమతులు
గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రముఖులు, అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బహుమతులతో కూడిన బాస్కెట్లను అందజేయనుంది. సమ్మిట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరుకానున్నారు. వీరికి ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులు హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే వారికి ఎప్పటికీ గుర్తిండిపోయేలా స్వాగత సత్కారాలు చేసి ఒక బాస్కెట్‌ను అందిస్తారు. బాస్కెట్‌లో సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్, పోచంపల్లి శాలువా, చేర్యాల మాస్క్ (పెయింటింగ్స్), హైదరాబాద్ అత్తర్, హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఉంటాయి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ బాస్కెట్‌లో మహువా లడ్డూలు, సకినాలు, అప్పాలు, బాదామ్ కీ జాలి వంటి తెలంగాణ సంప్రదాయ వంటకాలు కూడా ఉంటాయి. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు.