Share News

CM Revanth Reddy: ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీగా హైదరాబాద్‌!

ABN , Publish Date - Nov 21 , 2025 | 04:51 AM

హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత నివాస యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకురాష్ట్ర ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు....

CM Revanth Reddy: ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీగా హైదరాబాద్‌!

  • రాష్ట్ర రాజధానిలో 8 వారాల పాటు పైలట్‌ ప్రాజెక్టు

  • ట్రాఫిక్‌, ప్రజాభద్రత, అత్యవసర సేవలకు ఏఐ ఆధారిత అంచనాలు

  • సీఎం రేవంత్‌ రెడ్డితో ఎనలాగ్‌ ఏఐ సీఈవో కిప్‌మన్‌ భేటీ

హైదరాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత నివాస యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకురాష్ట్ర ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎనలాగ్‌ ఏఐ సంస్థ సీఈవో అలెక్స్‌ కిప్‌మన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని గురువారం స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. మూసీ నది పునరుజ్జీవం, తెలంగాణ ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీ ప్రాజెక్టుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. అయితే, ట్రాఫిక్‌, పట్టణ ప్రాంతాల్లో వరద (అర్బన్‌ ఫ్లడ్డింగ్‌), సరస్సుల రక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణ అంశాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ‘ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌’ ఆధారంగా రియల్‌ టైమ్‌ సెన్సార్‌ నెట్‌వర్క్‌, స్మార్ట్‌ సిటీ నిర్వహణ పద్థతులను అమలు చేసే వీలుందని కిప్‌మన్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దీంతో హైదరాబాద్‌లో ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. ఎనిమిది వారాల పాటు ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు అమలవుతుంది. ఇందులో భాగంగా సీసీ కెమెరాల వ్యవస్థను రియల్‌ టైమ్‌ సిటీ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌గా మారుస్తారు. ట్రాఫిక్‌, ప్రజా భద్రత, అత్యవసర సేవలన్నీ ఏఐ ఆధారిత అంచనాలతో ఒకేచోట సమన్వయం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఆయా అంచనాల ఆధారంగా.. సమస్యలు, వాటికి కారణాలు, పరిష్కారాలను ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ సూచిస్తుంది. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం పూర్తయ్యే నాటికి హైదరాబాద్‌ దేశంలోనే తొలి ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీగా మారుతుందనే అంచనాలున్నాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భారత్‌ ఫ్యూచర్‌ సిటీని పరిశోధన, సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్థి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. తెలంగాణ రైజింగ్‌ 2047 లక్ష్యాలను కిప్‌మన్‌కు వివరించారు. డిసెంబర్‌ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలని అలెక్స్‌ కిప్‌మన్‌ను సీఎం ఈ సందర్భంగా ఆహ్వానించారు.

Updated Date - Nov 21 , 2025 | 04:51 AM