Cinema Rising session of Telangana Rising Summit: సినీ గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:37 AM
సినీరంగంలో జపాన్, కొరియాలు ఎదిగిన తీరును స్ఫూర్తిగా తీసుకుని.. తెలంగాణను సినిమా పరిశ్రమకు గ్లోబల్ హబ్‌గా 2047 నాటికి తీర్చిదిద్దడానికి సహకరిస్తామని సినిమా రైజింగ్ సదస్సులో పాల్గొన్న సినీ ప్రముఖులు ......
పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమా.. రాష్ట్రంలో సినీ స్కిల్స్ వర్సిటీ అవసరం.. ‘సినిమా రైజింగ్’ సదస్సులో వక్తలు
తెలంగాణ రైజింగ్ 2047లో సినీ పెద్దల ఆలోచనలు, భాగస్వామ్యాన్ని కోరుతున్నాం
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, డిసెంబరు9 (ఆంధ్రజ్యోతి): సినీరంగంలో జపాన్, కొరియాలు ఎదిగిన తీరును స్ఫూర్తిగా తీసుకుని.. తెలంగాణను సినిమా పరిశ్రమకు గ్లోబల్ హబ్‌గా 2047 నాటికి తీర్చిదిద్దడానికి సహకరిస్తామని ‘సినిమా రైజింగ్’ సదస్సులో పాల్గొన్న సినీ ప్రముఖులు పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దర్శకులు, నిర్మాతలు, నటులు సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. భవిష్యత్తులో సినిమా.. స్ర్కీన్లు, థియేటర్లు దాటి వర్చువల్ స్థాయికి వెళ్లనుందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సినీ నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్‌ను మలచుకోవడానికి తమ వంతు సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఇక, సినీ పరిశ్రమ విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని.. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047లో సినీ రంగ పెద్దల ఆలోచనలు, భాగస్వామ్యాన్ని కోరుతున్నామన్నారు. అన్నపూర్ణ స్టూడియోతో ప్రారంభమైన సినీ రంగ అభివృద్ధి ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ ఇక్కడ ప్రపంచస్థాయి స్టూడియో నిర్మించడానికి ముందుకు వచ్చేదాకా సాగిందని గుర్తుచేశారు. కాగా.. సినిమాల నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల పనులూ ఒకేచోట జరిగేలా సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సదస్సుకు వ్యాఖ్యాతగా ఉన్న అర్జున్ కపూర్ పేర్కొన్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు మారిందని.. నాటి నుంచి బాలారిష్టాలు దాటుకుని ప్రపంచస్థాయి సినిమాలను ఇక్కడ నిర్మించుకోగలుగుతున్నామని నిర్మాత డి.సురే్‌షబాబు అన్నారు. ‘‘మన సినిమాలు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి చేరుకున్నాయి, మార్కెట్ కూడా అదే విధంగా పెరిగింది. అందరు ముఖ్యమంత్రులూ ఇక్కడ సినీ పరిశ్రమ స్థిర పడటానికి, మౌలిక వసతుల కల్పనకు సహకరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు లక్ష్యాలకు అనుగణంగా సినీ పరిశ్రమ అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఇక్కడ సినీ రంగ అభివృద్ధికి అన్ని ప్రభుత్వాలూ సహకరించాయని.. నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. కొరియా సినిమా అభివృద్ధిని మనం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ‘‘30 ఏళ్ల క్రితం అక్కడ కొరియా వాళ్లు నాటిన విత్తనం నేడు ప్రతి ఇంటికీకొరియన్ సినిమాల రూపంలో చేరింది. మనం కూడా అదే స్థాయికి చేరుకోవాలి’’ అని ఆయన ఆకాంక్షించారు. ఇక.. సినిమాలు సాంస్కృతిక రాయబారుల వంటివన్న నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి.. సినిమాల ద్వారా వ్యాపారవిస్తరణ, ఉత్పత్తుల ప్రచారం, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం లక్ష్యంగా ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఉదాహరణకు జపాన్ 30 ఏళ్ల క్రితం తమ సంస్కృతి, ఆహారపుటలవాట్లకు.. ముఖ్యంగా నూడుల్స్‌కు సంబంధించి నిర్మించిన ఒక సినిమా ప్రపంచాన్ని కుదుపు కుదిపిందని గుర్తు చేశారు. ‘‘ఈ రోజు ఆ నూడుల్స్ వ్యాపారం 58 వేల కోట్ల రూపాయలకు చేరింది. అందులో కేవలం రూ.7వేల కోట్ల వ్యాపారం జపాన్‌లో జరగ్గా.. మిగతాదంతా ప్రపంచ దేశాల్లో జరిగింది’’అని వివరించారు. సినిమా వ్యాపారం ప్రపంచంలో తిరుగులేనిదని.. అయితే, దానికి కావాల్సిన మౌలిక వసతుల విషయంలో ప్రభుత ్వం స్పష్టమైన పాలసీని రూపొందించాలని సూచించారు. కాగా.. సినీ పరిశ్రమను భవిష్యత్తు తరాలకు అందించేలా సినీ కళల యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవాలని బాలీవుడ్ రచయిత రాకేశ్ కుమార్ సూచించారు.
మలయాళ సినిమాలకు హైదరాబాద్ బ్యాకప్
మలయాళ సినిమా రంగానికి హైదరాబాద్ బ్యాక్‌పగా నిలుస్తోందని.. ఇక్కడ జరిగే సినీ రంగ అభివృద్ధి ప్రణాళికల్లో తాము తప్పనిసరిగా భాగస్వాములం అవుతామని మలయాళ నటుడు, నిర్మాత అసిఫ్ అలీ అన్నారు. ఇక.. సినిమాలకు హద్దులు చెరిగిపోయాయని, తన సినీ ప్రస్థానం హైదరాబాద్ నుంచే ప్రారంభమైందని సదస్సులో పాల్గొన్న బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ అన్నారు. సినీ రంగానికి చెందిన అన్ని విభాగాల్లో కొత్త రక్తానికి అవకాశం ఇచ్చే విధంగా సినీ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కాగా.. సినీ రంగంలో మహిళలు పనిచేయడానికి సురక్షిత వాతావరణం ముఖ్యమని ప్రముఖ దర్శక నిర్మాత జోయా అక్తర్ అన్నారు. సినీ రంగ అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికల్లో మహిళా భాగస్వామ్యం పెరగాలని ఆమె ఆకాంక్షించారు. అయితే.. సినీ నిర్మాణంలో మహిళలు తక్కువగా ఉన్నారని.. ప్రముఖ నటి జెనీలియా అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులతో హైదరాబాద్ నగరం సినీ గ్లోబల్ హబ్‌గా మారాలని ఆకాంక్షించారు.
స్ర్కిప్ట్‌తో వస్తే.. సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా.. సినీ రంగాన్ని ప్రోత్సహిస్తాం
చిత్ర పరిశ్రమ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్
రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలూ కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. స్ర్కిప్ట్‌తో వస్తే సినిమా పూర్తిచేసుకుని వెళ్లేలా సినీ రంగాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో.. సినీ నటుడు చిరంజీవి, నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని.. 24 క్రాఫ్ట్స్‌లో సినిమా అవసరాలకు అనుగుణంగా స్థానికులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సినీ ప్రముఖులకు సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోల ఏర్పాటుకు తమ వైపు నుంచి అన్ని రకాల సహాయ, సహకారాలూ ఉంటాయని హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నటులు జెనీలియా, అక్కినేని అమల, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సీఎంతో సమావేశమైన వారిలో ఉన్నారు.
సీఎం ఆలోచనలకు మద్దతుగా నిలుస్తాం: చిరంజీవి
ప్రపంచదేశాలకు చెందినవారు హైదరాబాద్‌కు వచ్చి షూటింగ్‌లు జరుపుకొనేలా.. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ హబ్‌ను నెలకొల్పాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పాన్ని అభినందిస్తున్నానని సినీ హీరో చిరంజీవి పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగిస్తూ.. సినీ పరిశ్రమ తరఫున ఒక ప్రతినిధిగా తాను ఇక్కడకు వచ్చానన్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో తాను కలిసినప్పుడు హైదరాబాద్‌ను ఫిల్మ్‌హబ్‌గా తీర్చిదిద్దుదామని, ఇతర దేశాలవారు ఇక్కడకు వచ్చి షూటింగ్ జరుపుకొనేలా చేయాలని చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఇంత తక్కువ సమయంలోనే అన్ని సెక్టార్లనూ ఫ్యూచర్ సిటీకి ఆహ్వానించడం రేవంత్‌రెడ్డి ఒక్కరికే సాధ్యమైందన్నారు. ప్రపంచానికి హైదరాబాద్ సినిమా హబ్‌గా మార్చేందుకు తనతోపాటు పరిశ్రమలోని వారందరూ ఆయనకు సహకరిస్తారని చెప్పారు. ‘‘సల్మాన్‌ఖాన్, అజయ్‌దేవ్‌గణ్‌లు స్మార్ట్, ఫ్యూచరిస్టిక్ స్టూడియోలు ఇక్కడ పెడతామని చెబుతున్నారు. ఇది శుభారంభం. నేను, నాగార్జున, వెంకటేశ్, ఇతర ప్రొడ్యూసర్లు.. అంతా దీనిపై దృష్టిపెడతాం’’అని పేర్కొన్నారు. సినీరంగంలో స్థిరపడేలా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెడితే లక్షలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇక్కడ స్టూడియోలకు స్థలాలు ఇవ్వడమే కాకుండా.. శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వపరంగా సదస్సు నిర్వహించాలని సూచించారు.
ఐటీ విప్లవానికి తెలంగాణ పుట్టినిల్లు
తెలంగాణ రాష్ట్రం భారతదేశ పటంలో ఓ భాగం మాత్రమే కాదు. దేశ ఐటీ విప్లవానికి పుట్టినిల్లుగా ప్రపంచపటం మీద నిలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో వచ్చిన ఈ విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర అభివృద్ధిని ఐటీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రజల ఆధారిత సాంకేతిక పరిసరాల వైపు తీసుకెళ్తుంది. ఒక కొత్త నిర్మాణాత్మక మార్పు తీసుకు వస్తుంది. రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో ఇది కీలక దశ
- ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణియన్, భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు
తెలంగాణలో పెట్టుబడులు పెడతాం
నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని. మా నాన్న ఆ స్కూల్‌కు ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. ఐఐటీ అనంతరం 1972లో కెనడా వెళ్లా. ఆ తర్వాత ఫైర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ప్రారంభించా. ఒక్క భారత్‌లోనే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. దాన్ని త్వరలోనే 20 బిలియన్ డాలర్లు చేస్తాం. అందులో తెలంగాణ కూడా ఉంటుంది. తెలంగాణ విజన్ 2047లో మూడు ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధన లక్ష్యంగా పెట్టడం ఉత్తేజకరం. ప్రజలకు మంచి విద్య, నాణ్యమైన వైద్యం, పరిశుభ్ర పర్యావరణం అందించడం కోసం ఈ విజన్‌లో నిర్దేశించిన లక్ష్యాలు కూడా ప్రేరణ కల్పించేవే. వాటి అమలు కూడా సాధ్యమే. ఆల్ ది బెస్ట్ టు సీఎం రేవంత్‌రెడ్డి. ఆల్ ది బెస్ట్ టు తెలంగాణ
- ప్రేమ్ వత్స, ఫైర్ ఫాక్స్ ఫైనాన్షియల్ సీఈవో
ఈ విజన్‌తో పెట్టుబడులే కాదు..హైక్వాలిటీ ఉద్యోగాలూ వస్తాయి
తెలంగాణ ఒక యంగ్ రాష్ట్రం. టెక్నాలజీ, పాలన, ఇన్‌క్లూజివ్ గ్రోత్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక స్థాయికి వచ్చింది. తెలంగాణ విజన్ 2047తో ప్రపంచస్థాయి పెట్టుబడులే కాదు..హై క్వాలిటీ ఉద్యోగాలూ వస్తాయి. తెలంగాణతో ఏఐ, సైబర్ సెక్యూరిటీలో కలిసి పనిచేసి వచ్చే తరాన్ని సిద్ధం చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ ఇవన్నీ పథకాలు కాదు లైఫ్ లైన్స్. తెలంగాణ, హైదరాబాద్ రూపాంతరం, అభివృద్ధిని నేను చూశా. ఇక్కడ ప్రతిభ కలిగిన మానవ వనరులున్నాయి. మనం కలిసి ఒక ప్రపంచాన్ని సృష్టిద్దాం
- శంతను నారాయణ్, అడోబ్ సీఈవో
తెలంగాణ విజన్‌లో భాగస్వామిగా ఉంటా
దార్శనికత-విధానాలు-లక్ష్యాల సాఽధనలో అనేక రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నా. దేశంలోని అనేక రాష్ట్రాలు ఆయా రంగాల్లో సాధిస్తున్న వృద్ధిలో వ్యత్యాసాలు అక్కడి నాయకత్వ ప్రతిభకు అద్దం పడతాయి. ఏటా జిల్లా స్థాయిలో జరుగుతున్న పని-వాటి ఫలితాల సమాచారం తెప్పించుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. లక్ష్యాలను నిర్దేశించుకోవడం, దానికోసం అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని పనిచేస్తామని విజన్‌లో పేర్కొనడం ఉత్తేజకరం. తెలంగాణ విజన్‌లో భాగస్వామిగా ఉంటాం.
- ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్