Hyderabad Police: ప్రియుడితో కలిసి.. కన్నతల్లిని చంపిన బాలిక
ABN , Publish Date - Jun 25 , 2025 | 04:05 AM
సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడిపై మోజుతో.. కన్నతల్లినే కర్కశంగా చంపేసిందో పదిహేనేళ్ల బాలిక! తన ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని భావించి.. ప్రియుడు, అతడి తమ్ముడితో కలిసి ఆమె మెడకు చున్నీతో ఉరి బిగించింది! అప్పటికీ.. చనిపోయిందో లేదోనన్న అనుమానంతో..
పూజ చేసుకుంటుండగా మెడకు
చున్నీ బిగించి.. సుత్తితో కొట్టి హత్య
హైదరాబాద్‌లో దారుణం
19 ఏళ్ల యువకుడితో బాలికకు ఇన్‌స్టాలో పరిచయం.. ఇటీవల అతడితో పరార్
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి
వారికి కౌన్సెలింగ్ ఇచ్చిపంపినపోలీసులు
తల్లిని చంపితే తప్ప.. ప్రియుడితో కలిసి
ఉండలేనన్న నిర్ణయానికి వచ్చిన బాలిక
ప్రియుడు, అతడి తమ్ముడితో కలిసి హత్య
జీడిమెట్ల/హైదరాబాద్ సిటీ, ఇనుగుర్తి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడిపై మోజుతో.. కన్నతల్లినే కర్కశంగా చంపేసిందో పదిహేనేళ్ల బాలిక! తన ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని భావించి.. ప్రియుడు, అతడి తమ్ముడితో కలిసి ఆమె మెడకు చున్నీతో ఉరి బిగించింది! అప్పటికీ.. చనిపోయిందో లేదోనన్న అనుమానంతో.. ముగ్గురూ కలిసి సుత్తితో కొట్టి కొట్టి ఆమె ప్రాణాలు తీశారు!! రాజధాని హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిందీ దారుణం. బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పుట్టిన తర్వాత భర్త మరణించడంతో కొన్నాళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. మరో కుమార్తె పుట్టాక.. రోడ్డు ప్రమాదంలో అతడు కూడా చనిపోయాడు. అప్పట్నుంచీ ఆమె ఒంటరిగా ఉంటూ పిల్లలిద్దరికీ ఏ లోటూ రాకుండా అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఈ క్రమంలో.. పదో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తెకు ఎనిమిది నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో 19 ఏళ్ల యువకుడితో పరిచయమైంది. క్రమంగా అది ప్రేమగా మారింది. ఈ విషయాన్ని గమనించిన తల్లి కూతుర్ని మందలించింది. చదువుపై దృష్టి పెట్టాలని హెచ్చరించింది. తల్లి మాటను వినని బాలిక.. ఈ నెల 18వ తేదీన తన ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో తల్లి 19వ తేదీన జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఆచూకీ కోసం గాలించిన పోలీసులు.. 20వ తేదీన ఇద్దరినీ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి, యువకుడికి నోటీసులు ఇచ్చి ఎవరింటికి వారిని పంపించారు.
తల్లి చనిపోతేనే..
బాలికను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత తల్లి కూడా ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చింది. తండ్రి లేకున్నా ఏ లోటూ రాకుండా పెంచుతున్నానని.. బాగా చదువుకుని గొప్ప స్థాయికి రావాలని హితబోధ చేసింది. కానీ, తల్లి మాటలు ఆ బాలికకు రుచించలేదు. ఇదిలా ఉండగా.. బాలికను ప్రేమించిన యువకుడి తల్లి రెండు రోజుల క్రితం వారి ఇంటికి వచ్చి.. ‘నీ కూతురు మా అబ్బాయిని ప్రేమిస్తోంది. ఆమెను మాతో మా ఇంటికి పంపించెయ్’ అంటూ గొడవ పెట్టుకుంది. అందుకు బాలిక తల్లి ససేమిరా ఒప్పుకోకపోవడంతో వాగ్వాదానికి దిగింది. ఇదంతా చూస్తున్న బాలిక.. తన ప్రేమకు తల్లి అడ్డుపడుతోందని, ఆమె బతికి ఉండగా తన ప్రియుడితో కలిసి ఉండటం కష్టం అని భావించింది. ప్రియుడితో కలిసి తల్లిని చంపేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందుకు తన ప్రియుడితో కలిసి ఒక పథకం వేసింది. ఆ పథకం ప్రకారం.. సోమవారం సాయంత్రం చెల్లి ట్యూషన్‌కు వెళ్లిన సమయంలో ప్రియుణ్ని తన ఇంటికి రప్పించుకుంది. తల్లి ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో.. వెనుకనుంచి వెళ్లి ప్రియుడితో కలిసి చున్నీతో ఆమె మెడకు ఉరి బిగించింది. ఇద్దరూ కలిసి బలంగా లాగడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె చనిపోయిందో లేదో వారు నిర్ధారించుకోకముందే.. బాలిక చెల్లి ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చింది. దీంతో బాలిక ఆమెను లోపలికి రానివ్వకుండా బయటే ఆపేసి.. ‘‘అమ్మ స్ఫృహ తప్పి పడిపోయింది. నేను అమ్మను చూసుకుంటాను. నువ్వు నా స్నేహితురాలి ఇంటికి వెళ్లి తనను తీసుకురా’ అని చెల్లిని పంపేసింది. తల్లి చనిపోయిందోలేదో తెలియకపోవడంతో.. తన ప్రియుడి తమ్ముణ్ని కూడా పిలిపించింది. ముగ్గురూ కలిసి తల్లి తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. అనంతరం యువకులిద్దరూ ఇంట్లోంచి పారిపోతున్న సమయంలోనే.. బాలిక చెల్లి ఇంటికి తిరిగొచ్చింది. లోపలికి వెళ్లి.. రక్తపుమడుగులో పడి ఉన్న తల్లిని చూసి ఆందోళనతో పెద్దగా అరుస్తూ భోరున విలపించింది. అక్కడే ఉన్న బాలిక.. ‘‘ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తా’’ అంటూ చెల్లిని సైతం బెదిరించింది. కానీ.. అప్పటికే చిన్న కుమార్తె అరుపులు, ఏడుపు విని చుట్టుపక్కల వారు ఇంట్లోకి వచ్చారు. లోపలి దృశ్యాలు చూసి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లిని చంపేసిన పెద్ద కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రియుణ్ని, అతడి తమ్ముణ్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కాగా.. మృతురాలికి మహబూబాబాద్ జిల్లాలోని ఆమె స్వగ్రామంలో బుధవారం అంత్య క్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
పోక్సో కేసు పెట్టి ఉంటే..
పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ దారుణం జరిగిందని మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికకు మాయ మాటలు చెప్పి, ప్రేమ పేరుతో నమ్మించి, ఇంట్లోంచి తీసుకెళ్లిన వ్యక్తిపై పోక్సో, కిడ్నాప్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయకుండా కేవలం నోటీసు ఇచ్చి వదిలేయడంతోనే వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడుతున్నారు. బాలానగర్ డీసీపీ, ఏసీపీ, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ ఈ హత్యకు పరోక్షంగా కారణమయ్యారని.. దీనిపై సీపీ విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈహత్య జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. మృతురాలి చిన్న కుమార్తె బాధ్యతను తామే తీసుకుంటామని వెన్నెల గద్దర్ పేర్కొన్నట్లు తెలిసింది.