Hyderabad Police Bust IBomma Piracy: ఐబొమ్మ ద్వారా బెట్టింగ్ యాప్‌ల ప్రచారం
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:15 AM
ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి వల్ల సినిమా రంగానికే కాకుండా సమాజానికి కూడా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ రూపంలో తీరని నష్టం జరిగిందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా రవిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు....
ఉచిత సినిమా ఎరతో 50లక్షల మంది డేటా తస్కరణ
వాటిని సైబర్ నేరగాళ్లు వాడుకొనే ప్రమాదముంది
రవి వందల కోట్లు క్రిప్టో కరెన్సీగా తరలించాడు
మేమే పట్టుకున్నాం... ఎవరూ సహకరించలేదు: సజ్జనార్
విలేకరుల సమావేశంలో పైరసీ వివరాల వెల్లడి
లక్షల మంది కష్టం దోచుకున్నారు: చిరంజీవి
ఉచితం వెనుక ప్రాణాంతక ముప్పు: రాజమౌళి
ఐబొమ్మ, బప్పంటీవీ వెబ్‌సైట్ల మూసివేత
సజ్జనార్‌కు పవన్ కల్యాణ్ అభినందనలు
హైదరాబాద్ సిటీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి వల్ల సినిమా రంగానికే కాకుండా సమాజానికి కూడా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ రూపంలో తీరని నష్టం జరిగిందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా రవిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సినీ హీరోలు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజు, సురేష్ బాబులతో కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ, ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్, కాపీ రైట్ యాక్ట్, బీఎన్‌ఎ్‌సలోని పలు సెక్షన్ల కింద నాలుగు కేసులు నమోదు చేశామని తెలిపారు. రవి కొత్త సినిమాల పైరసీ ద్వారా సినీ పరిశ్రమకు నష్టం చేశారని చెప్పారు. వెబ్‌సైట్లో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ చేస్తున్నాడని, ఆ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలై చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. ఐ బొమ్మ మాస్టర్ మైండ్ రవి వద్ద 1972 నాటి గాఢ్‌ఫాదర్ సినిమా మొదలు ఇటీవల వచ్చిన ఓజీ సినిమా వరకు హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఇతర భాషల సినిమాల పైరేటెడ్ కాపీలు 21వేల వరకు ఉన్నాయని తెలిపారు. పైరసీతో రూ.20 కోట్లు సంపాదిందించాడని, అందులో రూ.3 కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు. ఐబొమ్మ వెబ్‌సైట్ల ద్వారా లక్షల మంది ప్రేక్షకులను 1విన్, 1ఎక్స్ బెట్ వంటి అక్రమ బెట్టింగ్ వేదికల వైపు మళ్లించాడని చెప్పారు. రవి వద్ద 50 లక్షల మంది సబ్‌స్ర్కైబర్ల సమాచారం ఉందని, దీన్ని సైబర్ నేరగాళ్లు వాడుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డేటాను ఎవరెవరికి అందించారనే విషయమై లోతైన విచారణ చేపడుతామని చెప్పారు. రవి లేటెస్ట్ టెక్నాలజీ వినియోగించి ఉదయం థియేటర్‌లో రిలీజైన సినిమాను సాయంత్రానికే ఐబొమ్మలో పెట్టేవాడన్నారు. ఈ కేసులో దుద్దెల శివాజీ, సురస్ల ప్రశాంత్‌లను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఐబొమ్మ, బప్పం టీవీ కొన్నేళ్లుగా సినిమాలను పైరసీ చేస్తున్నాయని, కొన్ని సినిమాలను థియేటర్లలో విడుదల కాగానే కొన్ని సినిమాలను ఓటీటీలో విడుదల కాగానే గంటల వ్యవధిలోనే రెండు వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారని తెలిపారు. థియేటర్లలో కెమెరాలు పెట్టి, ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ర్కీన్ రికార్డ్ చేస్తూ ఆ వీడియోలను వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశారని తెలిపారు. రెండు వెబ్‌సైట్లనూ నిలిపివేశామని తెలిపారు. పైరసీ చేయడంలో ఎలాంటి తప్పు లేదంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఇలా చేయడం చట్టప్రకారం శిక్షార్హమని చెప్పారు. ఈ వెబ్‌సైట్ల అక్రమ బెట్టింగ్, గేమింగ్ సైట్లకు యూజర్లను బలవంతంగా మళ్లిస్తున్నారని, వ్యక్తిగత డేటా కూడా దొంగతనానికి గురవుతోందని తెలిపారు. క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు వారం రోజుల కస్టడీ కోరుతున్నామని చెప్పారు.
దమ్ముంటే పట్టుకోండని సవాల్
వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం తమ దగ్గర ఉందని రవి బెదిరింపులకు దిగిన విషయాన్ని సజ్జనార్ ప్రస్తావించారు. ‘‘వేరే దేశంలో ఉండి దమ్ముంటే పట్టుకొండి అని సవాల్ విసిరాడు. ఇప్పుడు ఎక్కడున్నారో చూడండి. తప్పు చేసిన వాళ్లు, చేస్తున్న వాళ్లు చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అన్నారు. రవి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశామని, మూడు మొబైల్ ఫోన్లు, మూడు ల్యాప్‌టా్‌పలు, ఆరు సీపీయూలు, 10 బ్యాంకు పాస్‌బుక్‌లు, 35 వివిధ బ్యాంకులకు చెందిన చెక్‌బుక్‌లతో పాటు 34 బ్యాంకుల డెబిట్/క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అదనపు పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాసులు, డీసీపీ దారా కవిత నేతృత్వంలో సైబర్ క్రైం యూనిట్ ఈ కేసును ఛేదించినట్లు తెలిపారు.
ఇతర దేశాల్లో పౌరసత్వం
‘‘ఇమ్మడి రవి స్వస్థలం విశాఖ. బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. ప్రహ్లాద్ వెల్లాల పేరుతో మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డులు తీసుకున్నాడు. ఏపీలో కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. సినీరంగం అప్రమత్తమైఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు అతడి వెంట పడ్డారు. భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్‌లో ఉంటూ ఽథాయ్‌లాండ్, దుబాయ్ వివిధ దేశాలు తిరిగేవాడు. 2019లో ఐ బొమ్మ ప్రారంభించాడు. 21 వేల సినిమాలను అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ సర్వర్లలో పెట్టాడు. 110 డొమైన్లను కొనుగోలు చేశాడు. వందల కోట్ల నగదు క్రిప్టో కరెన్సీ రూపంలో బదిలీ అయింది. రాకెట్‌లో ఉన్న మిగతా వాళ్లను కూడా బయటకు తీసుకువస్తాం’’ అని సీపీ సజ్జనార్ తెలిపారు. ఇతడిపై లోతైన దర్యాప్తు కోరుతూ సీబీఐ, ఈడీలకు లేఖలు రాస్తామన్నారు. ఐబొమ్మ నిర్వాకుల అరెస్ట్ తర్వాత కొంతమంది పోలీసులను కించపరుస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారని, వారిపై కూడా దృష్టి పెడతామని హెచ్చరించారు. పోలీస్ నెట్‌వర్క్ ద్వారా నిందితులను పట్టుకున్నామని, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు తమకు ఎవరూ సహకరించలేదని చెప్పారు. సైబర్ క్రైం అదికారులను సీపీ సత్కరించి, రివార్డులు అందించారు.
కష్టాన్ని దోచుకుంటే బాధగా ఉంటుంది: చిరు
సినీ పరిశ్రమ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారని, వాళ్ల కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే బాధగా ఉంటుందని చిరంజీవి అన్నారు. ప్రజలు కూడా సినిమా తమదిగా భావించి, పైరసీకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాజమౌళి తీయబోయే సినిమాతో మన ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరిస్తుందని చెప్పారు. అలాంటి సమయంలోనూ పైరసీ ముప్పు ఉండటం ఆందోళనకరమని అన్నారు.
ఉచితం వెనుక పెద్ద ప్రమాదం: రాజమౌళి
పోలీసులకు ఛాలెంజ్ విసిరిన నిందితుడు రెండు నెలల్లో అరెస్ట్ కావడం సినిమాలో సూపర్ హిట్ సన్నివేశంలా ఉందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఏదీ ఉచితంగా రాదని, ఒకవేళ అలా వస్తే దాని వెనుక పెద్ద ప్రమాదం పొంచి ఉంటుందని, అది చావు వరకూ తీసుకెళ్లే ప్రమాదం ఉందని చెప్పారు. పైరసీ సినిమాలను అడ్డం పెట్టుకుని ప్రజల వ్యక్తిగత సమాచారం విక్రయించి సంపాదిస్తున్నారని తెలిపారు. మీ పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, ఈ మెయిల్ ఐడీ ఉంటే చాలు సైబర్ నేరగాళ్లు మీ ఖాతా ఖాళీ చేయడం, బెదిరింపులకు పాల్పడటం ఇలా ఏదైనా చేయొచ్చని చెప్పారు. మన సమాచారం క్రిమినల్స్ చేతిలో పడటం వల్ల డబ్బులు పోవడమే కాదు ప్రాణాలు పోయే వరకూ వెళ్తోందన్నారు. పైరసీ వల్ల సినిమా వాళ్ల కన్నా చూసేవాళ్లే ఎక్కువ నష్టపోతున్నారని చెప్పారు. పైరసీని అడ్డుకునేందుకు త్వరలో సినీ పరిశ్రమ లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోబోతోందని సురేశ్‌బాబు తెలిపారు. సజ్జనార్‌ను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. ‘‘సినిమాలు విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. పైరసీముఠాలను కట్టడి చేయడం స్వాగతించదగ్గ పరిణామం’’ అన్నారు. బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కదలిక తెచ్చిందని ప్రశంసించారు.
మీ దేశంలో సేవలు నిలిపివేస్తున్నాం
రవి వద్ద ఉన్న పాస్‌వర్డ్‌ల సాయంతో ఐ బొమ్మ, బప్పం టీవీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న 65 వెబ్‌సైట్లను పోలీసులు బ్లాక్ చేయించారు. వెబ్‌సైట్‌లో మీ దేశంలో మా సేవలు శాశ్వతంగా నిలిపి వేశామంటూ ప్రస్తుతం అందులో ప్రకటన కనిపిస్తోంది. ‘‘ఇటీవల మా గురించి మీకు తెలిసి ఉండవచ్చు లేదా మొదటి నుంచి మీరు మమ్మల్ని అభిమానిస్తూ ఉండవచ్చు, ఏది ఏమైనా మాసేవలు మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేస్తున్నాంు. మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాం’ అన్న సందేశం కనిపించింది.