Hyderabad Poised to Become Startup Capital: స్టార్ట్‌పల రాజధాని
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:14 AM
హైదరాబాద్‌ను దేశానికే స్టార్ట్‌పల రాజధానిగా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. భారతదేశ ఆవిష్కరణల రంగానికి హైదరాబాద్ కేంద్రబిందువుగా నిలుస్తోందన్నారు...
ఆవిష్కరణల రంగానికి కేంద్రబిందువుగా హైదరాబాద్
‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్/శంషాబాద్ రూరల్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను దేశానికే స్టార్ట్‌పల రాజధానిగా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. భారతదేశ ఆవిష్కరణల రంగానికి హైదరాబాద్ కేంద్రబిందువుగా నిలుస్తోందన్నారు. ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజీలో ఓ స్టార్ట్‌పను ప్రారంభించారని.. అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీ అని గుర్తుచేశారు. బుధవారం టీ హబ్‌లో జరిగిన ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ప్రారంభోత్సవానికి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూగుల్ సంస్థ గ్లోబల్ నైపుణ్యం, టీహబ్ స్టార్టప్ కమ్యూనిటీ, దానికితోడు ప్రభుత్వ మద్దతు.. ఈ మూడు శక్తులు కలగలిసిన ప్రత్యేక భాగస్వామ్యం భారత ఆవిష్కరణకర్తలకు కొత్త అవకాశాలు అందిస్తోందని తెలిపారు. 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన అనేక స్టార్ట్‌పలు నేడు బిలియన్ డాలర్ కంపెనీలుగా ఎదిగాయన్నారు. హైదరాబాద్ కేవలం స్టార్ట్‌పల కేంద్రంగా ఎదగడమే కాదు.. ఆ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని కోరుకుంటున్నామని అన్నారు. నగరం నుంచి కనీసం 100 స్టార్ట్‌పలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆవిష్కర్తలకు అవసరమైన సహకారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ సంస్థ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్టార్ట్‌పల కోసం తమ ప్రభుత్వం రూ.1000 కోట్లతో స్టార్టప్స్ ఫండ్ ఏర్పాటు చేస్తుందని రేవంత్ చెప్పారు. ఆ నిధులను వినియోగించుకొని, స్టార్ట్‌పలు బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గత 25 ఏళ్లలో సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్‌లో చాలా స్టార్ట్‌పలు పెద్ద కంపెనీలుగా ఎదిగాయని సీఎం చెప్పారు.
వర్సిటీల్లో ‘ఇంక్యుబేషన్’ కేంద్రాలు: శ్రీధర్‌బాబు
కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ‘ఇంక్యుబేషన్’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బుధవారం టీ హబ్‌లో ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ను సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. ‘మేం స్టార్ట్‌పలను కేవలం చిన్న కంపెనీలుగా చూడడం లేదు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు అందిస్తూ.. కొత్త ఉద్యోగాలను సృష్టించే ఆర్థిక ఇంజన్లుగా చూస్తున్నాం. 2024లో ఇక్కడి స్టార్ట్‌పలు 571మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 160 శాతం అధికం’ అని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
జీఎంఆర్ స్పోర్ట్స్, ప్రభుత్వం మధ్య ఒప్పందం
జీఎంఆర్ స్పోర్ట్స్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. గ్లోబల్ సమ్మిట్‌లో ఈ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా దుబాయ్ స్పోర్ట్స్ సిటీని భాగస్వామ్య సంస్థగా చేసుకొని, జీఎంఆర్‌స్పోర్ట్స్ భారత్ ఫ్యూచర్ సిటీలో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయనుంది. ప్రాజెక్టులో ఆధునిక శిక్షణా కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తామని జీఎంఆర్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్‌కుమార్ తెలిపారు.