Share News

Elevated Corridor: జోరుగా.. హుషారుగా.. ఔటర్‌కు!

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:39 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కోర్‌ సిటీ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు వాహనదారులు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా రెండు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది....

Elevated Corridor: జోరుగా..  హుషారుగా.. ఔటర్‌కు!

  • హైదరాబాద్‌ మధ్య నుంచి ఔటర్‌కు మరో 2 ఎలివేటెడ్‌ కారిడార్లు

  • షేక్‌పేట నాలా నుంచి గండిపేటలోని సీబీఐటీ వరకు ఒకటి

  • బంజారాహిల్స్‌ నుంచి గచ్చిబౌలి వరకు మరో కారిడార్‌

  • రహదారులను విస్తరించేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు

  • ఇప్పటికే హైదరాబాద్‌-నాగపూర్‌ మార్గంలో, ప్యారడైజ్‌-శామీర్‌పేట రూట్‌లో కారిడార్ల నిర్మాణ పనులు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కోర్‌ సిటీ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు వాహనదారులు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా రెండు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి నేరుగా ఔటర్‌కు చేరేందుకు వీలుగా హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో ఒక ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు చేపట్టారు. అలాగే హైదరాబాద్‌ - కరీంనగర్‌ మార్గంలో సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట వరకూ మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు త్వరలోనే ప్రారంభమవ్వనున్నాయి. ఈ రెండు కారిడార్లకు తోడు కొత్తగా.. బంజరాహిల్స్‌ రోడ్డు నెంబర్‌-12 నుంచి జడ్జీస్‌ కాలనీ మీదుగా దుర్గంచెరువు పక్క నుంచి నేరుగా గచ్చిబౌలిలోని శిల్పా లే-అవుట్‌ మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు వెళ్లేలా మరో ఎలివేటెడ్‌ కారిడార్‌కు ప్లాన్‌ చేశారు. అదే విధంగా షేక్‌పేట నుంచి నాలా నుంచి గండిపేటలోని సీబీఐటీ వరకూ 200 అడుగులతో రోడ్డు నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఈ మార్గంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేసేందుకు వీలుగా డిజైన్‌ చేస్తున్నారు. రాజధానిలో ఏ ప్రాంతానికైనా సులువుగా చేరుకునేందుకు వీలుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డును మణిహారంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఔటర్‌పై రయ్యిన దూసుకుపోయే వాహనాలు.. ఔటర్‌ దిగిన తర్వాత ట్రాఫిక్‌ రద్దీ కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరడం కష్టతరమవుతోంది. అలాగే.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రావడం కూడా నగరవాసులకు సవాల్‌గా మారుతోంది. హైదరాబాద్‌ కోర్‌ సిటీ ప్రాంతానికి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు.. మెహదీపట్నం, ఆరాంఘర్‌, చాంద్రాయణగుట్ట, సాగర్‌ రింగ్‌ రోడ్డు, ఎల్‌బీనగర్‌, నాగోల్‌, ఉప్పల్‌, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌, బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, మాసాబ్‌ట్యాంక్‌ మీదుగా మెహదీపట్నం వరకు ఉన్నది. ఈ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఔటర్‌కు చేరేందుకు ఇప్పటికే ఉన్న కనెక్టివిటీ రోడ్లన్నీ ట్రాఫిక్‌తో రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గాలను సరికొత్తగా తీసుకొచ్చేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది.


గండిపేట కాండూట్‌ వెంట..

మెహదీపట్నం నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరేందుకు టోలిచౌకి, షేక్‌పేట, రాయదుర్గం, గచ్చిబౌలి మీదుగా ఇప్పటికే ఉన్న పాత ముంబై రోడ్డులోనే వాహనాలు వెళ్తుంటాయి. ఈ మార్గంలో ఇప్పటికే షేక్‌పేట ప్లైఓవర్‌ వచ్చినా.. వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. రాయదుర్గం నుంచి గచ్చిబౌలి, రాయదుర్గం నుంచి నానక్‌రాంగూడ మార్గాల్లో కూడా విపరీతమైన రద్దీ ఉంటోంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరేందుకు ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో ప్రత్యామ్నాయంగా షేక్‌పేట నాలా నుంచి గండిపేట కాండూట్‌ వెంట మణికొండ మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి పైపులైన్‌ మార్గంలో సీబీఐటీ వరకు సరికొత్త రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గండిపేట కాండూట్‌ వెంట ఇప్పటికే రోడ్డు ఉండగా.. దాన్నీ ఇరువైపులా 200అడుగుల మేర విస్తరించడానికి కసరత్తు చేస్తున్నారు. షేక్‌పేట నాలా నుంచి గండిపేటలోని సీబీఐటీ కాలేజీ వరకూ సరికొత్త రోడ్డుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ రోడ్డు విస్తరణ పూర్తయిన తర్వాత దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. ఎలివేటెడ్‌ కారిడార్‌తో వాహనదారులు నేరుగా ఔటర్‌ వరకూ చేరేందుకు అవకాశం ఉంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు.


బంజారాహిల్స్‌ నుంచి..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టడంతో పాటు నగరం నడిబొడ్డు నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు వేగంగా చేరేందుకు వీలుగా సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12 నుంచి ఫిలింనగర్‌, జడ్జెస్‌ కాలనీ, దుర్గం చెరువు, టి-హబ్‌, శిల్పా లే-అవుట్‌ ఫ్లై-ఓవర్‌ వరకూ ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి ప్రతిపాదించారు. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌కు వెళ్లే శిల్పా లే-అవుట్‌ ఫ్లై-ఓవర్‌ను ఆరు వరసల రహదారిగా మార్చనున్నారు. దాదాపు పది కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ సరికొత్త రహదారిలో దాదాపు ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల మేర ఆరు లైన్ల స్టీల్‌ బ్రిడ్జిని నిర్మాణం చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో అండర్‌పా్‌సలతో పాటు ఎక్కడా వాహనం ఆగకుండా వెళ్ళేందుకు వీలుగా నగరం నడిబొడ్డున ఎక్స్‌ప్రెస్‌ వేను తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణంపై ఇప్పటికే ప్రాథమికంగా హెచ్‌ఎండీఏ అధికారులు సర్వే పూర్తి చేశారు. సరికొత్త రోడ్డు నిర్మాణానికి పూర్తిస్థాయిలో ప్రాజెక్టు రిపోర్టు తయారీ కోసం తాజాగా కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది.

శామీర్‌పేట ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. బెకెమ్‌కే

సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వరకూ హెచ్‌ఎండీఏ నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు బెకెమ్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్‌కు ఖరారయ్యాయి. 18.5 కిలోమీటర్ల మేర ఈ కారిడార్‌ నిర్మాణ పనులు చేపట్టేందుకు నెల క్రితం హెచ్‌ఎండీఏ ఈపీసీ మోడ్‌లో రూ.2,232 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. ఈ పనుల కోసం రెండు నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. టెండర్లు వేసిన రెండు నిర్మాణ సంస్థల సాంకేతిక, ఫైనాన్స్‌ బిడ్లు పరిశీలించిన అనంతరం బెకెమ్‌ ఇన్‌ఫ్రాను అధికారులు ఎంపిక చేసి.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. కొత్త ఏడాదిలో ఆ సంస్థ పనులు చేపట్టనుంది. ఈ 18.5 కిలోమీటర్ల కారిడార్‌లో భాగంగా 11.65 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ప్లైఓవర్‌ను నిర్మాణం చేయనుండగా.. మరో 6.52 కిలోమీటర్లు గ్రౌండ్‌ లెవెల్‌, హకీంపేట వద్ద 450 మీటర్ల మేర అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ నిర్మాణం చేయనున్నారు. 24 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిబంధనలు విధించారు. ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ పూర్తయితే ఉత్తర తెలంగాణలోని నిజమాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల నుంచి వాహనదారులు నేరుగా నగరంలోకి రాకపోకలు సాగించగలుగుతారు.

Updated Date - Dec 23 , 2025 | 04:39 AM