Hyderabad Metro Financial Crisis: మెట్రో మాకొద్దు!
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:16 AM
హైదరాబాద్ మెట్రో రెండో దశను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది. దాంతో, మొదటి దశను కూడా మీరే తీసేసుకోండని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది...
అప్పులు, అధిక వడ్డీలను భరించలేకపోతున్నాం
పెరిగిన నిర్మాణ వ్యయాన్నీ మాకు ఇవ్వడం లేదు
6000 కోట్లిస్తే ప్రాజెక్టు నుంచి తప్పుకొంటాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎల్‌అండ్‌టీ లేఖ
బకాయిలతోనే ఆర్థిక సంక్షోభమని వెల్లడి
2024-25లో మెట్రో ఆదాయం1108 కోట్లు
భూములను సద్వినియోగం చేసుకుంటే ఆదాయంవచ్చి ఉండేదని నిపుణుల వ్యాఖ్య
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రెండో దశను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది. దాంతో, మొదటి దశను కూడా మీరే తీసేసుకోండని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. తమకు రూ.6,000 కోట్లను సర్దుబాటు చేస్తే ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకొంటామని ప్రతిపాదించింది. అప్పుల భారం పెరుగుతోందని, మెట్రోను తాము నిర్వహించే పరిస్థితి ఇక లేదని స్పష్టం చేసింది. మెట్రో మొదటి దశలోని తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్రానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే, మెట్రో నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకొంటామని ఎల్‌అండ్‌టీ చెబుతుండడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ రెండు మూడుసార్లు ఇటువంటి ప్రకటనలే చేసింది. అయితే, ఈసారి కేంద్ర గృహ నిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి జైదీ్‌పకు ఇటీవల లేఖ రాసింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసింది. మొదటి దశలో చేపట్టిన మూడు కారిడార్లను కేంద్రానికి లేదా రాష్ట్రానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఇదే విషయాన్ని వారం రోజుల కిందట సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడించింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో టికెట్లు, ప్రకటనలతో వచ్చే ఆదాయం నిర్వహణకు సరిపోవడం లేదని, వడ్డీలు, విద్యుత్తు చార్జీలు, ఉద్యోగుల జీతభత్యాలు భారంగా మారాయని పేర్కొన్నట్లు తెలిసింది. మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కారు కోరుతున్న సమయంలో మొదటి దశ నుంచి తాము తప్పుకొంటామని ఎల్‌అండ్‌టీ లేఖ రాయడం గమనార్హం. అప్పులు, అధిక వడ్డీలను సమస్యగా చూపిస్తూ.. మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకొంటామని ప్రతిపాదిస్తోంది. జాప్యంతో పెరిగిన నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వాలు సర్దుబాటు చేయకపోవడమూ కారణమని చెబుతున్నారు.
నష్టాలు నిజమేనా..!?
హైదరాబాద్ మెట్రోలోని మూడు కారిడార్లలో ప్రస్తుతం రోజుకు దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మన దగ్గర కనీస చార్జీ రూ.11 కాగా.. గరిష్ఠ చార్జీ రూ.69గా ఉంది. మిగిలిన మెట్రోలతో పోలిస్తే మన దగ్గరే చార్జీలు కాస్త ఎక్కువనే విమర్శ కూడా ఉంది. ఇక, మెట్రో నిర్వహణ అంటే.. టికెట్ చార్జీలు, యాడ్‌ల ఆదాయం లాభదాయకంగానే ఉన్నప్పటికీ అప్పులు, అధిక వడ్డీలతోనే తమకు నష్టాలు వస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. నిజానికి, హైదరాబాద్‌లో 2012లో మెట్రో మొదటి దశ ప్రాజెక్టును చేపట్టారు. తొలుత రూ.14,132 కోట్లతో ప్రతిపాదించిన పనుల ఖర్చు 2017లో ప్రాజెక్టు (ఎల్బీ నగర్-మియాపూర్, జేబీఎస్- ఎంజీబీఎస్, నాగోల్-రాయదుర్గం కారిడార్లు.. మొత్తం 69.2 కిలోమీటర్లు) పూర్తయ్యేసరికి రూ.22 వేల కోట్లకు చేరింది. దాంతో, పనులను పూర్తి చేసేందుకు ఎల్‌అండ్‌టీ వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం రూ.15,920.23 కోట్ల ఆస్తులున్న మెట్రోకు మొదటి దశలో రూ.8,148.07 కోట్ల అప్పులున్నాయి. మెట్రో నిర్మాణానికి తొలుత ప్రతిపాదించిన రూ.14,132 కోట్లలో ఎల్‌అండ్‌టీ రూ.9,892 కోట్లను పది బ్యాంకుల నుంచి 7-10 శాతం వడ్డీకి రుణం తీసుకుంది. తన వాటాగా 20 శాతం అంటే రూ.2,826 కోట్లను సమకూర్చింది. కేంద్రం 1,413 కోట్లను వీజీఎ్‌ఫగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే, బ్యాంకుల నుంచి దాదాపు పది శాతం వడ్డీకి అప్పులు తీసుకొచ్చామని, వాటికి వడ్డీలు కట్టడం భారంగా మారిందని ఇప్పుడు ఎల్‌అండ్‌టీ చెబుతోంది. ప్రాజెక్టు నుంచి తాము తప్పుకోవడానికి ఇదే ప్రధాన కారణంగానూ వివరిస్తోంది. నిజానికి, మెట్రో నిర్వహణ వ్యయం ఏడాదికి దాదాపు రూ.400 కోట్లు. కాగా.. 2024-25లో హైదరబాద్ మెట్రోకు మొత్తం రూ.1,108.54 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో టికెట్ చార్జీల ద్వారా వచ్చిన ఆదాయమే రూ.627.11 కోట్లు. వెరసి, నిర్వహణ వ్యయం పోను మొదటి దశ నిర్మాణానికి చేసిన అప్పులకు ఇప్పటి వరకు రూ.4,500 కోట్ల వడ్డీలు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు.
రూ.4 వేల కోట్లకుపైగా అదనపు ఆదాయం
హైదరాబాద్ మెట్రోను 2014 నాటికే పూర్తి చేయాల్సి ఉంది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం రెండు అలైన్‌మెంట్లను మార్చాలని సూచించింది. అలైన్‌మెంట్‌లో మార్పులతో నిర్మాణంలో జాప్యం చోటు చేసుకుంది. దాంతో, నిర్మాణ వ్యయమూ పెరిగింది. వెరసి, నిర్మాణంలో జాప్యం కారణంగా 2017 నాటికే రూ.3,756 కోట్ల నష్టం జరిగిందని, దానిని సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ భారం 2020 నాటికి రూ.5000 కోట్లకు చేరిందని మెట్రో అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనికితోడు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) రూ.254 కోట్లూ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలోనే నిర్వహణ నుంచి తప్పుకోవాలని ఎల్‌అండ్‌టీ చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, టికెట్లు, యాడ్‌ల ద్వారా మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ ద్వారా మెట్రో రూ.4000 కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. నిజానికి, మెట్రో కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టీకి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు మార్గాల్లో ఆదాయానికి అవకాశం చ్చింది. ఒకటి, టికెట్ల ద్వారా 50ు ఆదాయార్జన. రెండోది.. యాడ్స్ ద్వారా 5ు ఆదాయం. మూడోది.. అత్యంత కీలకమైనది రియల్ ఎస్టేట్. మెట్రోకు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 269 ఎకరాలను ఇచ్చింది. 60 ఏళ్లపాటు ఈ ప్రభుత్వ స్థలాలను వినియోగించుకుని నిర్వహణను చేపట్టాలని ఒప్పందం చేసుకున్నారు. వీటిలో ఆఫీసు స్పేస్‌లను, షాపింగ్ మాల్స్ నిర్వహణ ద్వారా ఆదాయాన్ని సాధించడం. దాంతో, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్, పంజాగుట్ట, మూసారాంబాద్ ప్రాంతాల్లో 18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు మాల్స్ నిర్మించింది. వీటిని సబ్ లైసెన్స్‌కు ఇచ్చి రూ.3000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, రాయదుర్గంలోని 15 ఎకరాలను రూ.1045 కోట్లకు సబ్ లీజుకు ఇచ్చింది. ఇందులో 2023లో ఎల్‌అండ్‌టీకి రూ.512 కోట్లు వచ్చాయి. మిగిలిన మొత్తం రావాల్సి ఉంది. నిజానికి, రవాణా ఆధారిత అభివృద్ధి కింద ఇచ్చిన 269 ఎకరాల్లో ఇప్పటి వరకు 50 శాతం భూములను కూడా మెట్రో సద్వినియోగం చేసుకోలేదని తెలుస్తోంది. మెట్రో ఆర్థిక సంక్షోభానికి ఇది ప్రధాన కారణంగా ఆ సంస్థ అధికారులే చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ అధీనంలోనే..
హైదరాబాద్‌లోనే కాకుండా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కొచ్చి, లఖ్‌నవూ, నాగ్‌పూర్, పుణె, అహ్మదాబాద్‌ల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. వీటన్నిటినీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే చేపట్టారు. వాటినిర్వహణ కోసం ప్రత్యేక కార్పొరేషన్లు (ఎస్పీవీ) ఏర్పాటు చేశారు. వీటిలో అత్యధికం లాభాల బాటలోనే పయనిస్తున్నాయని వాటి గణాంకాలు చెబుతున్నాయి. మరికొన్ని వ్యవస్థలు నష్టాల్లో కొనసాగుతున్నా.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు దానిని భారంగా పరిగణించడం లేదు. దానిని వాణిజ్యపరంగా చూడకుండా ప్రజా రవాణా మెరుగుపరిచే సామాజిక అవసరంగా చూస్తున్నాయి. కొవిడ్ సమయంలో హైదరాబాద్ మెట్రోకు మాత్రమే కాకుండా వాటికి కూడా నష్టాలు వచ్చాయి. అయినా, వాటిని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రోను పీపీపీ మోడల్‌లో ఏర్పాటు చేయడమే కాకుండా దానికి ప్రభుత్వ భూములను కూడా ఇచ్చారు. దాదాపు 90 శాతం నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నారు. భూములను సద్వినియోగం చేసుకోకపోవడమే మెట్రో ప్రస్తుత పరిస్థితికి కారణమని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఇక, మెట్రో వసూలు చేస్తున్న అద్దెలూ ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు, రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్‌లో చదరపు గజానికి రూ.30 వేల అద్దె విధించడంతో చాలామంది ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా.. కొత్త రైళ్లు, అదనపు బోగీలను ఏర్పాటు చేయకపోవడం మరో ప్రధాన లోపంగా వివరిస్తున్నారు.