Group 1 Exam Delays Tags:: గ్రూప్-1పై హైకోర్టు తీర్పును గౌరవిస్తాం
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:38 AM
గ్రూప్-1 పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు...
పదేళ్లు పరీక్ష నిర్వహించలేని అసమర్థత బీఆర్‌ఎస్‌ది: జూపల్లి
టీజీపీఎస్సీని రోడ్డు మీదకు లాగిందే బీఆర్‌ఎస్సే
ఎంపీలు మల్లు రవి, చామల, బలరాం నాయక్
హైదరాబాద్, న్యూఢిల్లీ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇక, దేశంలోనే పేరొందిన టీజీపీఎస్సీని బీఆర్‌ఎస్ పార్టీ రోడ్డు మీదకు లాగిందని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, బలరాం నాయక్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోమంత్రి జూపల్లి, ఢిల్లీలో ఎంపీలు మల్లు రవి, చామల, బలరాం నాయక్ గ్రూప్-1 అంశంపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రూప్-1 అంశంలో కోర్టు తీర్పును పరిశీలించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని జూపల్లి చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేని అసమర్థత బీఆర్‌ఎ్‌సది అని జూపల్లి ఎద్దేవా చేశారు. ఇక, టీజీపీఎస్సీని రోడ్డు మీదకు లాగిన బీఆర్‌ఎస్ ఇప్పుడు గురువింద నీతులు చెబుతుంటే రాష్ట్రంలోని నిరుద్యోగులంతా నవ్వుకుంటున్నారని ఎంపీలు మల్లు రవి, చామల, బలరాం నాయక్ అన్నారు. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను నడిరోడ్డుపై పెట్టి బేరాలు సాగించిన బీఆర్‌ఎస్ ఇప్పుడు నీతులు మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం 1,600 మంది విద్యార్థులు బలిదానాలు చేస్తే, కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్, సంతోష్, కవిత మాత్రమే లబ్ధి పొందారని ఆరోపించారు.