Hyderabad Crime: ఐపీఎస్ అధికారిపై రౌడీషీటర్ దాడి
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:36 AM
నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ హత్య ఘటన మరువక ముందే రాష్ట్ర రాజధానిలో ఓ ఐపీఎస్ అధికారిపై దాడి జరిగింది....
హైదరాబాద్, చాదర్‌ఘాట్‌లో ఘటన
సెల్‌ఫోన్ దొంగలను వెంబడించిన సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య
డీసీపీ, ఆయన గన్‌మన్‌పై కత్తితో దొంగల దాడి..ఇద్దరికీ గాయాలు
గన్‌మన్ తుపాకీతో డీసీపీ కాల్పులు
పట్టుబడిన ఓ దొంగ, మరొకరి పరారీ
హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్/అఫ్జల్‌గంజ్/చాదర్‌ఘాట్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ హత్య ఘటన మరువక ముందే రాష్ట్ర రాజధానిలో ఓ ఐపీఎస్ అధికారిపై దాడి జరిగింది. సెల్‌ఫోన్ దొంగతనం చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు యత్నించిన హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, ఆయన గన్‌మన్‌పై దొంగలు కత్తితో దాడి చేశారు. దీంతో డీసీపీ తుపాకీతో కాల్పులు జరిపారు. డీసీపీ కాల్పుల్లో గాయపడిన మహ్మద్‌ఒమర్ అన్సారీ అనే రౌడీషీటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా... మరో దొంగ పరారయ్యాడు. డీసీపీ చైతన్య పోలీసు కమిషనరేట్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న తర్వాత తన కార్యాలయానికి బయలుదేరారు. 5 గంటల సమయంలో చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు సెల్‌ఫోన్ దొంగతనం చేసి పారిపోతుండగా ఆ సమయంలో అటుగా వాహనంలో వెళుతున్న డీసీపీ చైతన్య గమనించారు. దీంతో తన గన్‌మన్ మూర్తితో కలిసి ఆ దొంగలను వెంబడించారు. విక్టరీ ప్లేగ్రౌండ్ వెనుక ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు యత్నించిన దొంగలు ఓ భవనంపైకి ఎక్కి గ్రౌండ్‌లోకి దూకేందుకు ప్రయత్నించారు. కానీ, తప్పించుకునేందుకు మార్గం లేక పోలీసులపై కత్తితో దాడికి దిగారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో గన్‌మన్ మూర్తి గాయపడి కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన డీసీపీ చైతన్య తన గన్‌మన్ తుపాకీ తీసుకుని దొంగలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ దొంగల్లో ఒకరి చెయ్యి, కడుపు భాగంలో గాయాలై కుప్పకూలిపోయాడు. మరో దొంగ తప్పించుకుని పారిపోయాడు. గాయపడి పోలీసులకు చిక్కిన దొంగను కాలాపత్తర్ పోలీసుస్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్న మహ్మద్ ఒమర్ అన్సారీగా గుర్తించారు. అతడిని చాదర్‌ఘాట్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. దొంగలతో జరిగిన తోపులాటలో డీసీపీ చైతన్య నడుము, తలకు స్వల్ప గాయాలవ్వగా..గన్‌మన్ మూర్తి కాలు, చేతికి గాయాలయ్యాయి.
వీరిద్దరికీ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందించి ఆ తర్వాత సోమాజీగూడలోని మరో ఆస్పత్రికి తరలించారు. కాగా, డీసీపీపై దాడి ఘటన తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, సౌత్, సెంట్రల్ జోన్ డీసీపీలు స్నేహ మెహ్రా, శిల్పావల్లిలు పరిస్థితిని సమీక్షించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన సజ్జనార్.. దొంగలను పట్టుకునే క్రమంలో డీసీపీ చైతన్య రెండు రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు. పోలీసులకు పట్టుబడిన ఒమర్‌పై దొంగతనాలు, దోపిడీలు, మారణాయుధాలు సహా 20 కేసులు ఉన్నాయని, అతనిపై రెండు సార్లు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలులో కూడా పెట్టారని చెప్పారు. ఒమర్‌తో కలిసి పోలీసులపై దాడి చేసి పరారైన మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారని వెల్లడించారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఓ ఇంటి యజమాని తీసిన వీడియోను, పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు.
డీసీపీ చైతన్య.. హ్యాట్సాఫ్ : సంజయ్
రౌడీ షీటర్ వ్యవహారంలో డీసీపీ చైతన్య, ఆయన గన్‌మెన్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు పోలీసులకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దని, ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాల్సిందేనని పోలీసులకు సూచించారు.