HCAH Suvitas Rehabilitation Center: హైదరాబాద్‌లో రోబోటిక్ గైట్ ట్రైనర్
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:17 AM
నాడీ సంబంధిత సమస్యలు, కండరాల బలహీనత వల్ల చలనం కోల్పోయిన రోగులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఉపయోగపడే...
తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన హెచ్‌సీఏహెచ్
రోబోటిక్స్, రికవరీ ల్యాబ్ ప్రారంభం
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): నాడీ సంబంధిత సమస్యలు, కండరాల బలహీనత వల్ల చలనం కోల్పోయిన రోగులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఉపయోగపడే ‘జీ గైటర్’ అనే అత్యాధునిక రోబోటిక్ గైట్ ట్రైనర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా హెచ్‌సీఏహెచ్ సువిటాస్ రిహాబిలేషన్ సెంటర్.. హైదరాబాద్‌లోని సోమాజీగూడలో సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని బుధవారం ప్రారంభించింది. నగరంలోనే తొలిసారిగా ఈ కేంద్రంలో జి గైటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏహెచ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ గౌరవ్ తుక్రాల్ మాట్లాడుతూ.. తెలంగాణలో స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, పట్టణ ప్రాంతాల్లో నమోదువుతున్న కేసుల్లో 20-30 శాతం మంది 18 నుంచి 45 ఏళ్ల లోపు వారే ఉంటున్నారని తెలిపారు. ఆ రోగులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అవసరమైన రీహాబిలిటేషన్ కేంద్రాల కొరత ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 11.7 లక్షల మంది రోగులకు ఒక రీహాబిలిటేషన్ కేంద్రం మాత్రమే ఉందని తెలిపారు. స్ట్రోక్ లేదా పెద్ద శస్త్ర చికిత్స తర్వాత రోగి కోలుకునే క్రమంలో మొదటి 90 రోజులు అత్యంత కీలకమన్న డాక్టర్ గౌరవ్.. రోబోటిక్స్, రికవరీ ల్యాబ్ ద్వారా సాధ్యమైనంత వేగంగా రోగులు కోలుకునేలా చేయవచ్చని తెలిపారు. హెచ్‌సీఏహెచ్ మెడికల్ ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ జనగామ పాల్గొన్నారు.