Share News

Hyderabad Emerging as Top Hub: జీసీసీలకు కేరాఫ్‌ హైదరాబాద్‌

ABN , Publish Date - Oct 12 , 2025 | 04:04 AM

భారతదేశంలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల జీసీసీకు హైదరాబాద్‌ ప్రత్యేక కేంద్రంగా అవతరిస్తోంది. వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ బహుళజాతి...

Hyderabad Emerging as Top Hub: జీసీసీలకు కేరాఫ్‌ హైదరాబాద్‌

  • గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థల క్యూ.. దేశంలో గత 30 నెలల్లో ఏర్పాటైన వాటిల్లో 40ు ఇక్కడే

  • ఎక్స్‌ఫీనోస్‌ వర్క్‌ ఫోర్స్‌ నివేదిక

హైదరాబాద్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): భారతదేశంలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హైదరాబాద్‌ ప్రత్యేక కేంద్రంగా అవతరిస్తోంది. వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు వ్యాపార విస్తరణ, పరిశోధన, అభివృద్ధి కోసం ఇతర దేశాల్లో జీసీసీలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇందుకోసం తక్కువ ఖర్చులో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్న నగరాలను ఎంపిక చేసుకుంటాయి. అయితే, ఈ జీసీసీల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు ఇటీవల కాలంలో హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌ ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి పొందడం, అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కొలువై ఉండడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఇందుకు ప్రధాన కారణాలు.

30 నెలల్లో 64 జీసీసీలు

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3800 జీసీసీలు ఉండగా వాటిల్లో 1900 (50ు) భారత్‌లోనే ఉన్నాయి. నగరాల వారీగా చూస్తే 890 జీసీసీలతో బెంగళూరు దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 475 జీసీసీలతో ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉండగా, ముంబైలో 375, పుణేలో 370, హైదరాబాద్‌లో 360, చెన్నైలో 310 ఉన్నాయి. అయితే, గత 30 నెలల్లో దేశంలో ఏర్పాటైన జీసీసీల్లో అత్యధికం హైదరాబాద్‌లోనే ఉండడం విశేషం. 2022 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 160 జీసీసీలు ఏర్పాటవ్వగా అందులో 40 శాతం అనగా 64 జీసీసీలు హైదరాబాద్‌లోనే ఏర్పాటయ్యాయి. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణే నగరాలను వెనక్కినెట్టి మరీ హైదరాబాద్‌ ఈ ఘనత సాధించడం గమనార్హం. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటైన జీసీసీల్లో అమెరికా కేంద్రంగా ఉన్న హెల్త్‌కేర్‌, ఆటోమోటివ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, టెక్నాలజీ రంగాలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. ఎక్స్‌ఫీనోస్‌ వర్క్‌ఫోర్స్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం జీసీసీల ఏర్పాటులో రాబోయే మూడేళ్లలో హైదరాబాద్‌ జీసీసీల పవర్‌ హౌస్‌గా అవతరించనుంది. కాగా, గత 30నెలల్లో హైదరాబాద్‌లో ఏర్పాటైన జీసీసీలతో రాష్ట్రంలో కొత్తగా 20వేల మందికి ఉద్యోగాలు లభించాయని రాష్ట్ర ఐటీ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.

బెంగళూరును అధిగమిస్తాం

రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాల వల్ల హైదరాబాద్‌లో జీసీసీల ఏర్పాటుకు కంపెనీలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాయి. అత్యధిక జీసీసీలతో బెంగళూరు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రాబోయే మూడేళ్లలో బెంగళూరును వెనక్కినెట్టి హైదరాబాద్‌ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది.

- శ్రీధర్‌బాబు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

Updated Date - Oct 12 , 2025 | 04:04 AM