Share News

KTR: జీసీసీల రాజధానిగా హైదరాబాద్‌

ABN , Publish Date - Oct 10 , 2025 | 03:58 AM

నేను ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా చెప్పేది ఒక్కటే.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టండి. ఇది ఒక నగరం మాత్రమే కాదు.. వైవిధ్యాలకు కేంద్ర బిందువు...

KTR: జీసీసీల రాజధానిగా హైదరాబాద్‌

  • ప్రపంచ స్థాయి మహానగరాలకు తీసిపోని విధంగా దూసుకెళుతోంది

  • ప్రస్తుతం 350 జీసీసీలు ఉన్నాయి..

  • 2030నాటికి 1,600కు పెరుగుతాయి

  • ప్రతిపక్షంలో ఉన్నా హైదరాబాద్‌లోపెట్టుబడులు పెట్టమనే చెబుతా

  • జీసీసీల సదస్సులో కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ‘నేను ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా చెప్పేది ఒక్కటే.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టండి. ఇది ఒక నగరం మాత్రమే కాదు.. వైవిధ్యాలకు కేంద్ర బిందువు. ఆర్థికంగా ప్రపంచస్థాయి మహానగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు దూసుకుపోతోంద’ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌-ఐసీఏఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌ జీసీసీలకు రాజధానిగా మారిందని, దీని వెనక గత ప్రభుత్వ కృషి ఎంతో ఉందని చెప్పారు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా.. త్వరలోనే మొదటి స్థానానికి వస్తుందన్నారు. బెంగళూరును దాటి మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. పదేళ్ల పాటు అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో హైదరాబాద్‌ను సమగ్రంగా తీర్చిదిద్దడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 350 వరకు జీసీసీలు ఉండగా, 2030 నాటికి 1,600కు పైగా ఏర్పాటు కావడంతో పాటు 19 లక్షల మంది నిపుణులకు ఉద్యోగావకాశాలు వస్తాయన్న ఽధీమా వ్యక్తం చేశారు. వ్యక్తుల ఆధారంగా కాకుండా శాశ్వతంగా మంచి ఫలితాలు వచ్చేలా వ్యవస్థలు, చట్టాలు, సంస్కరణలను తీసుకురావడం వల్ల తెలంగాణ వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. అందుకే బ్యాంకింగ్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఐటీ రంగాల్లో భారీగా పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించగలిగిందన్నారు. 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు వచ్చేలా టీఎస్‌ ఐపా్‌సను తెచ్చామని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో అత్యంత అనుకూలమైన వాతావరణం, వనరులు, మౌలిక వసతులు ఉన్నాయన్నారు. రాజకీయాలు మారుతాయి, కానీ రాష్ట్ర పురోగతి మారాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా తెలంగాణకు భారీగా పెట్టుబడులు రావాలని ఎప్పుడూ కోరుకుంటామని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఐసీఏఐ అధ్యక్షుడు చరణ్‌జోత్‌ సింగ్‌ నందా, హైదరాబాద్‌ బ్రాంచ్‌ చైర్మన్‌ చిన్న సీతారాంరెడ్డి, ఐటీ, ఐటీఈఎస్‌ రంగాల ప్రముఖులు, దేశంలోని వివిధ నగరాలకు చెందిన చార్టెడ్‌ అకౌంటెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 03:58 AM