ATA Business Seminar: భారత్, అమెరికా ఆర్థిక భాగస్వామ్యంలో హైదరాబాద్ కీలకం
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:42 AM
హైదరాబాద్ నగరం అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా.. వేగంగా ఎదుగుతోందని అమెరికన్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ అన్నారు...
అమెరికన్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
ప్రవాస భారతీయులకు మంత్రి ఉత్తమ్ పిలుపు
టీ హబ్‌లో ఘనంగా ఆటా బిజినెస్ సెమినార్
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ నగరం అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా.. వేగంగా ఎదుగుతోందని అమెరికన్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ అన్నారు. అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో ఈ నగరం కీలక కేంద్రంగా మారిందన్నారు. హైదరాబాద్ టీ హబ్ వేదికగా శుక్రవారంనాడు అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ బిజినెస్ సెమినార్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటుగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, సీఐఐ వైస్ ప్రెసిడెంట్ గౌతం రెడ్డి, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లారా విలియమ్స్ మాట్లాడుతూ.. భారతీయ పెట్టుబడిదారులు ఇప్పటికే అమెరికాలో 5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారని, ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక నమ్మకం, భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ సాధించిన ప్రగతి ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం గల మానవ వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు హైదరాబాద్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయన్నారు. ఐటీ పరంగా ఇన్నోవేటివ్ ఐడియాలకు టీ హబ్ కేంద్రంగా మారిందని, స్టార్ట్‌పలు, గ్లోబల్ కార్పొరేట్లు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే టీ హబ్ నమూనా దేశానికే ఆదర్శమని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, డేటా రక్షణ, కీలక మౌలిక సదుపాయాల భద్రతలో భారత్, అమెరికా పరస్పర సహకారం మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఆటా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ ఈ సందర్భంగా ఆటా సభ్యులను ఆహ్వానించారు. విదేశీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పారదర్శక విధానాలను ఈ సందర్భంగా వివరించారు. అమెరికన్ సంస్థలకు హైదరాబాద్ అత్యంత అనుకూల గమ్యస్థానమన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య సమన్వయమే తెలంగాణ బలమని ఆయన తెలిపారు.