IT Minister Sridhar Babu: క్వాంటం సిటీగా హైదరాబాద్!
ABN , Publish Date - Dec 05 , 2025 | 03:07 AM
క్వాంటం సిటీ’గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు....
దేశంలోనే తొలిసారిగా లాంగ్ టర్మ్ క్వాంటం స్ర్టాటజీ ఆవిష్కరణ
స్టార్టప్స్, ఇన్నోవేషన్స్ కోసం ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌ను ప్రారంభిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ’లో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ర్టాటజీ’ని రూపొందించామన్నారు. గచ్చిబౌలిలోని ఐఐఐటీ- హైదరాబాద్‌లో ‘నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం, తెలంగాణ క్వాంటం స్ర్టాటజీ’ని గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ... అప్పట్లో విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయని, అదే తరహాలో రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతోందన్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ తదితర టెక్నాలజీలలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ర్టాటజీ’లో భాగంగా రీసెర్చ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ యాక్సిలరేషన్, టాలెంట్ పైప్‌లైన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించామని చెప్పారు. క్వాంటం సెన్సింగ్, సెక్యూరిటీ, కమ్యూనికేషన్, క్వాంటం కంప్యూటింగ్‌లో పరిశోధనా, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రూపొందించిన ఈ పాలసీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. ఇది కేవలం తమ ప్రభుత్వం రూపొందించిన ఒక పాలసీ మాత్రమేకాదని, క్వాంటం టెక్నాలజీలో దేశానికి దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీలో దేశానికి ఒక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేేసలా ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్‌కు కూడా శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్టప్స్, కొత్త ఆలోచనలకు భరోసానిచ్చేలా ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.