Share News

Ponnam Prabhakar: హైదరాబాద్‌ ఇమేజ్‌ పెంచుతాం

ABN , Publish Date - Sep 25 , 2025 | 05:05 AM

సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ, బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు....

Ponnam Prabhakar: హైదరాబాద్‌ ఇమేజ్‌ పెంచుతాం

  • పనికిరాని వస్తువులను నాలాలో వేయొద్దు: పొన్నం

  • షేక్‌పేట్‌ ఓయూ కాలనీలో కేటీఆర్‌ హయాంలో డబ్బులుతీసుకొని రోడ్డు మూసేశారు

  • ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై తప్పుడు ప్రచారం

  • బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాపై ఫిర్యాదు చేస్తాం: వివేక్‌

యూసు్‌ఫగూడ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ, బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం యూసు్‌ఫగూడ డివిజన్‌ కృష్ణానగర్‌లోని వరద ప్రభావిత ప్రాంతంలో మంత్రి వివేక్‌ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి పొన్నం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్నటివరకు అధికారంలో ఉండి కుర్చీలో కూర్చున్న వాళ్లు కృష్ణానగర్‌ నాలా సమస్యపై మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ప్రజలు తమ ఇళ్లలోని పనికిరాని వస్తువులను నాలాలో పడేయొద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రి వివేక్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కమీషన్లు దండుకుని రూ.60 వేల కోట్లుగా ఉన్న అప్పును రూ.8 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు. కృష్ణానగర్‌ నాలా సమస్యపై ఇద్దరు సీనియర్‌ ఇంజనీర్లను అదనంగా నియమించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. షేక్‌పేట ఓయూ కాలనీలో మాజీ మంత్రి కేటీఆర్‌ హయాంలో డబ్బులు తీసుకొని రోడ్డును మూసివేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన కలిగించడానికి బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై, బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాపై సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేయాలన్నారు. కాగా, నాలాపై ఉన్న, రోడ్డు మధ్యలో ఉన్న ప్రజల నివాసాలను కూల్చబోమని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు. గాజుల రామారంలో ప్రజల ఇంటిని కూల్చ లేదని, అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను మాత్రమే కూల్చామని తెలిపారు. నాలాపై ఉన్న ఇండ్లను తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 05:05 AM