Share News

Hyderabad Crime Report: 15 శాతం తగ్గిన నేరాలు

ABN , Publish Date - Dec 28 , 2025 | 07:07 AM

హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలో నేరాలు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 15 శాతం తగ్గాయని సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

Hyderabad Crime Report: 15 శాతం తగ్గిన నేరాలు

  • కిడ్నాప్‌, అత్యాచారం కేసులు తగ్గాయి

  • పోక్సో కేసులు, భర్తల వేధింపులు పెరిగాయి

  • 28 శాతం తగ్గిన దొంగతనాలు, దోపిడీలు

  • సైబర్‌ నేరాలు 8 శాతం తగ్గుముఖం

  • హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలో నేరాలు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 15 శాతం తగ్గాయని సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. గత ఏడాది 35,944 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి 30,690 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే భౌతిక దాడులు, దొంగతనాలు, దోపిడీలు, కిడ్నా్‌పలు, హత్యలు, హత్యాచారాలు, హత్యాయత్నాలు భారీగా తగ్గాయని చెప్పారు. విజిబుల్‌ పోలీసింగ్‌, పెట్రోలింగ్‌ పెంచడం వంటి చర్యలతో నేరాలకు అడ్డుకట్ట వేయగలిగామన్నారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శనివారం సజ్జనార్‌ అడిషనల్‌ సీపీ శ్రీనివాస్‌, డీసీపీలతో కలిసి 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. మహిళలపై నేరాలు 6శాతం పెరిగాయని తెలిపారు. గత ఏడాది 2,482 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 568 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇళ్లలో భార్యలపై భర్తల వేఽధింపుల కేసులు పెరగ్గా, రేప్‌లు, కిడ్నా్‌పలు, వరకట్న వేధింపులు తగ్గాయని చెప్పారు. పోక్సో కేసులు 27 శాతం పెరిగాయన్నారు. గత ఏడాది 449 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 568 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దొంగతనాలు, దోపిడీలు, చైన్‌ స్నాచింగ్‌లు 28 శాతం తగ్గాయని, చోరీ సొత్తు రికవరీ 61 శాతం ఉందన్నారు. అర్ధరాత్రి అల్లరిమూకల ఆగడాలు పెరిగిపోతున్నాయని, గొడవలు, కొట్లాటలు గత ఏడాదితో పోల్చితే 49శాతం పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది 110 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో రౌడీలు, కేడీలు, అల్లరి మూకలపై ఉక్కుపాదం మోపుతున్నామని, వారు పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తంగా ఈ ఏడాది 7,130 కేసులు విచారణకు రాగా.. వాటిలో 4,463 కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. 63 శాతం కన్విక్షన్స్‌ సాధించామన్నారు.


251 కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ కేటుగాళ్లు

సైబర్‌ నేరాలు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 8.21 శాతం తగ్గాయని సజ్జనార్‌ తెలిపారు. గత ఏడాది 4,042 సైబర్‌ క్రైం కేసులు నమోదు కాగా ఈ ఏడాది 3,735కు తగ్గాయని చెప్పారు. గత ఏడాది బాధితులు రూ.339.50 కోట్లు పోగొట్టుకోగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.251.14 కోట్లుగా ఉందన్నారు. ఈ ఏడాది నమోదైన సైబర్‌ క్రైం కేసుల్లో 393 కేసులను (18 శాతం) ఛేదించామని, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 566 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేశామని చెప్పారు. స్తంభింపజేసిన ఖాతాల నుంచి రూ.30.05 కోట్లను బాధితుల ఖాతాల్లో జమ చేశామన్నారు.

కొత్త ఏడాది కుటుంబంతో ఉంటారా? జైలులో గడుపుతారా?

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా రాత్రి 7 నుంచి ఉదయం 3 గంటల వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని సజ్జనార్‌ తెలిపారు. కొత్త ఏడాది సందర్భంగా కుటుంబ సభ్యులతో గడపాలా? లేక జైలులో గడపాలా? అన్న నిర్ణయం మీ చేతుల్లోనే ఉందని మందుబాబులకు సూచించారు.

Updated Date - Dec 28 , 2025 | 07:09 AM