Tragedy: హైడ్రా కమిషనర్ గన్‌మ్యాన్ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:02 AM
ఒకవైపు ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌లకు బానిసై అప్పుల పాలవడం.. మరోవైపు ఆరోగ్య సమస్యలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ ముత్యాలపాయటి కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి...
ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో అప్పులు, ఆరోగ్య సమస్యలతో సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్న వైనం
హయత్‌నగర్/మన్సూరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌లకు బానిసై అప్పుల పాలవడం.. మరోవైపు ఆరోగ్య సమస్యలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ ముత్యాలపాయటి కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా రావిపాడు గ్రామానికి చెందిన కృష్ణ చైతన్య(33) 2020 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్. 2021లో హైదరాబాద్‌కు చెందిన పూజితతో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. కృష్ణ చైతన్య తండ్రి శివరామప్రసాద్ జైల్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా, సోదరుడు అనీల్‌కుమార్ హైకోర్డులో ఫైర్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ప్రసాద్‌కు స్థానికంగా సొంత ఇల్లు ఉంది. నాలుగు నెలల క్రితం కృష్ణ చైతన్య హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో తండ్రి ఇంటి సమీపంలో ఓ పెంట్ హౌస్ అద్దెకు తీసుకుని భార్యతో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం నిద్ర లేచిన అతను తన సర్వీస్ రివాల్వర్‌తో తల వెనుక కాల్చుకొని మంచంపైన కుప్పకూలిపోయాడు. దీంతో షాకైన కుటుంబ సభ్యులు అతణ్ణి ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సర్జరీ చేసి బుల్లెట్ తొలగించారు. కృష్ణ చైతన్య రెండేళ్ల క్రితం ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌కు అలవాటుపడి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ఈ క్రమంలో అతని వేతనంలో పెద్దఎత్తున కోత పడుతుండటంతో కుటుంబ పోషణ భారంగా మారినట్లు తెలుస్తోంది. అతను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. కొన్ని నెలల కిందట కుటుంబ సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోగా హయత్ నగర్ పీఎ్‌సలో అదృశ్యం కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత తిరిగొచ్చాడు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలతోనే కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేశాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఆస్పత్రికి వెళ్లి కృష్ణ చైతన్య ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.