Share News

AV Ranganath : కోర్టులో ఓ మూలన నిలబెడతాం

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:28 AM

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కోర్టులో ఓ మూల నిలబెడతామంటూ హెచ్చరించింది. అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట వ్యవహారానికి సంబంధించిన విచారణకు హైడ్రా కమిషనర్‌....

AV Ranganath : కోర్టులో ఓ మూలన నిలబెడతాం

  • ఉదయం 10:30 నుంచి సాయంత్రం దాకా ఉంచగలం

  • న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి

  • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

  • వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినా రాకపోవడంతో ఫైర్‌

  • 5న రాకపోతే నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తామని హెచ్చరిక

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కోర్టులో ఓ మూల నిలబెడతామంటూ హెచ్చరించింది. అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట వ్యవహారానికి సంబంధించిన విచారణకు హైడ్రా కమిషనర్‌ గైర్హాజరవడమే కాక వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరడమే హైకోర్టు ఆగ్రహానికి కారణం. అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంటకు సంబంధించిన భూవివాదంలో స్టేట్‌సకో (యథాతథస్థితి) ఉన్నప్పటికీ పనులు చేశారంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌లో ఏవీ రంగనాథ్‌ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. జస్టిస్‌ మౌషమీ భట్టాచార్య, జస్టిస్‌ మధుసూదన్‌రావు ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. అయితే, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరు కాలేదు. అంతేకాక, వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ‘నా హాజరు ద్వారా కోర్టును ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. విపత్తు నివారణకు సంబంధించిన పనులకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్‌ ఉన్నందున విచారణకు రాలేకపోతున్నాను. గురువారంతోపాటు భవిష్యత్తు ప్రొసీడింగ్స్‌ నుంచి కూడా నాకు మినహాయింపు ఇవ్వగలరు’ అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ ధర్మాసనానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కోర్టు ప్రొసీడింగ్స్‌, కోర్టు ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలతో ఉండటం నేర్చుకోవాలని గట్టి హెచ్చరిక జారీ చేసింది. ‘‘తన హాజరు వల్ల కోర్టును ఇబ్బంది పెట్ట దల్చుకోలేదు అంటూ రంగనాథ్‌ కోర్టు పట్ల సానుభూతి చూపుతున్నారు. కోర్టు అనుకుంటే కోర్టు ధిక్కరణదారులను సాయంత్రం వరకు కోర్టులోనే నిలబెట్టగలదు. కానీ అలాంటి చర్యలు తీసుకోవడం మా ఉద్దేశం కాదు. అవసరమైతే ఇక తప్పదు. భవిష్యత్తులో కూడా హాజరు నుంచి మినహాయింపు ఇస్తామని ఆయన ఎలా ఊహించుకుంటున్నారు?’ అని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఏవీ రంగనాథ్‌ డిసెంబరు 5న వ్యక్తిగతంగా హాజరు కాకపోతే నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తామని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.

Updated Date - Nov 28 , 2025 | 04:28 AM