CM Revanth Reddy: హైదరాబాద్‌లో ప్లాస్టిక్ బ్యాన్!
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:05 AM
హైదరాబాద్ మహానగరంలోని అవుటర్ రింగ్ రోడ్డు లోపలి భాగంలో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తిగా నిషేధం పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
కోర్ అర్బన్‌లో అతిపెద్ద సమస్య చెత్తే.. చెరువుల్లో, నాలాల్లోకి ప్లాస్టిక్ చేరొద్దు
జనవరి నుంచే పూడికతీత చేయాలి
జోనల్ అధికారులు ఫీల్డ్‌లో ఉండాలి
పది రోజులకు చెత్త క్లియరెన్స్ డ్రైవ్
నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించేది లేదు
అంటువ్యాధులకూ స్పందించాలి
అధికారులతో సమన్వయం స్పెషల్ సీఎ్‌సదే
జీహెచ్‌ఎంసీ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగరంలోని అవుటర్ రింగ్ రోడ్డు లోపలి భాగంలో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తిగా నిషేధం పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాజధానిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడం కోసం జీహెచ్‌ఎంసీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నామని చెప్పారు. మంగళవారం ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పురపాలన, పట్టణాభివృద్ధి శాఖలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) ప్రాంతాన్ని తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రం ఆధారంగా ప్రణాళిక బద్థంగా అభివృద్థి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇందులో భాగంగా క్యూర్ పరిధిలోని నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించి, పరిపాలనను పట్టాలెక్కిస్తున్నామని తెలిపారు. నగరంలో అత్యంత సంక్లిష్టమైన చెత్త నిర్వహణ సమస్యను సమర్థవంతంగా అధిగమించాలని అధికారులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా క్యూర్ ప్రాంతంలో చెత్త సమస్య పరిష్కారానికి ప్రధాన ప్రతిబంధంకంగా పరిణమించిన ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించామన్నారు. చెరువులు, వరద వెళ్లే నాలాలపై ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ బస్సులు, ఈవీ ఆటోలను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేస్తూ రోజూ క్షేత్ర స్థాయిలో తిరగాల్సిందేనని చెప్పారు. జోన్‌ల వారీగా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్‌లదేనని స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వేయకుండా చూడాలని చెప్పారు. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పది రోజులకు ఒకసారి చొప్పున నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకుండా, రోడ్లపై గుంతలు కనిపించకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. చెత్త విషయంలో నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం క్షమించేది లేదన్నారు.
స్మార్ట్ పాలన కావాలి
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. టెక్నాలజీ ఆధారంగా ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. కాలనీల, అపార్ట్‌మెంట్‌ల సంక్షేమ సంఘాలతో నిరంతరం టచ్‌లో ఉండాలని స్పష్టం చేశారు. సుపరిపాలనతో పాటు స్మార్ట్ పాలన అవసరమని చెప్పారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడికతీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్యూర్ ఏరియాలో విభాగాల అధికారుల సమన్వయ బాధ్యత స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ చూసుకుంటారని తెలిపారు. దోమల నివారణ, అంటువ్యాధులు బ్రలకుండా జాగ్రత్తలు కూడా జోనల్ కమిషనర్‌ల బాధ్యతేనని స్పష్టం చేశారు. సమస్యలను అధికారులకు తెలియజేయడానికి ప్రజలకు టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రతీ పది రోజులకోసారి వందశాతం చెత్త తొలగింపు డ్రైవ్ విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు.
నెలకోసారి సమీక్ష
కోర్ అర్బన్ పరిధిలోని హోటళ్లలో ఆహార నాణ్యత నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్యూర్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని కేటాయించి సాధ్యమైనంత త్వరగా భవనాలు నిర్మించాలన్నారు. అద్దె భవనాల నుంచి సొంత భవనాలకు కార్యాలయాలను తరలించాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలోని 12 జోన్లలో చెరువులు, కుంటలు, నాలాలను పూర్తిగా మ్యాపింగ్ చేయాలని చెప్పారు. ఆక్రమణలను తొలగించి వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద చెరువులను గుర్తించి, వాటిని పునరుద్ధరించి, యాక్టివిటీ జోన్స్‌గా అభివృద్థి చేయాలని సూచించారు. జనవరి నుంచి ప్రతీ ఒక్కరూ క్షేత్ర స్థాయిలో తిరగాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లకు సరిపడా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని, కలిసికట్టుగా పని చేయాలని, అప్పుడే నగరం భవిష్యత్ మారుతుందని అన్నారు. ప్రతీ నెలకు ఒకసారి జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి మాణిక్‌రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.