Land Encroachment: రూ.2,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:59 AM
ఐటీ కారిడార్ సమీపంలోని నెక్నాంపూర్‌లో ప్రభుత్వ భూమి కబ్జాకు హైడ్రా చెక్ పెట్టింది. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు..
చెర విడిపించిన హైడ్రా.. 23.16 ఎకరాల భూమికి ఫెన్సింగ్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఐటీ కారిడార్ సమీపంలోని నెక్నాంపూర్‌లో ప్రభుత్వ భూమి కబ్జాకు హైడ్రా చెక్ పెట్టింది. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు.. 23.16 ఎకరాల సర్కారీ స్థలం చుట్టూ సోమవారం ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూమి విలువ సుమారు రూ.2,500 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. నగరంలో ప్రతీచోటా సామాన్యులను ముందు పెట్టి బడా బాబులు చేస్తోన్న కబ్జా తతంగమే ఇక్కడా జరుగుతోంది. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో రెవెన్యూ, మునిసిపల్, ఇతర విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే చేసిన హైడ్రా అధికారులు.. వారి కుట్రలకు చెక్ పెట్టారు. ఆక్రమణలు తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామం సర్వే నెంబరు 20లో 23.16 ఎకరాలు ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది. అయితే పాకాల పోచయ్య వద్ద ఆ భూమిని కొనుగోలు చేసినట్టు మహ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాడు. కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు.. అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు. 1975లో పోచయ్య దగ్గర ఇబ్రహీం భూమి కొనుగోలు చేసినట్టు రికార్డులు సృష్టిస్తే.. 2019లో అదే భూమి తమదని పోచయ్య కుటుంబసభ్యులు పోరాటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అందిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. ఆ భూమిని కాపాడింది.
పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ గ్రామంలోని సర్వే నంబరు 1019, 1020(పి)లో వేసిన లే ఔట్‌లో పార్కు స్థలం ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. ఈ లే ఔట్‌లో 672 గజాల మేర పార్కుకు కేటాయించారు. ఆ పార్కు స్థలాన్ని భూ యజమాని తన బంధువుకు గిఫ్ట్ డీడ్ చేశారు. వివాదం మొదలై లే ఔట్ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు అది పార్కు స్థలమే అని నిర్థారణ అవ్వడంతో ఆక్రమణలను తొలగించారు. దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులను ఏర్పాటు చేశారు. దశాబ్దకాలంగా పార్కు స్థలం కోసం పోరాడుతున్నామని, హైడ్రా చర్యలతో ఇది సాధ్యమైందని నివాసితులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పార్కు స్థలం విలువ సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.