Share News

Deputy CM Bhatti Vikramarka: యాప్‌ డిజైన్‌ లీడర్‌గా హైదరాబాద్‌

ABN , Publish Date - Sep 19 , 2025 | 07:07 AM

హైదరాబాద్‌ను యాప్‌ డిజైన్‌ లీడర్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.

Deputy CM Bhatti Vikramarka: యాప్‌ డిజైన్‌ లీడర్‌గా హైదరాబాద్‌

  • ఏఐ టెక్నాలజీకి గ్లోబల్‌ సెంటర్‌గా రాష్ట్ర రాజధాని: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • త్వరలో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ డిజైన్‌’ ప్రారంభం: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను యాప్‌ డిజైన్‌ లీడర్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. యూఎంవో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారం హైటెక్‌ సిటీలోని ట్రైడెంట్‌ హోటల్‌లో ‘యూఎక్స్‌ ఇండియా-25’ పేరిట ఏర్పాటు చేసిన 21వ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌ అంతర్జాతీయ సదస్సును పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరం ఎలాంటి టెక్నాలజీనైనా అందిపుచ్చుకుని లీడర్‌గా ఎదుగుతుందని అన్నారు. ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్‌ను గ్లోబల్‌ సెంటర్‌గా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తోందన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు హైదరాబాద్‌ సంస్కృతి, కళలు, ఆహారాన్ని ఆస్వాదించాలని కోరారు. రాష్ట్ర టెక్నాలజీ రంగంలో ప్రతినిధులు ప్రధానంగా గుర్తించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను గ్లోబల్‌ డిజైన్‌ హబ్‌గా మార్చాలనే సంకల్పంతో త్వరలోనే ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ డిజైన్‌’ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. టీ-హబ్‌, టీ-వర్క్స్‌, వీ-హబ్‌ వంటి సంస్థల ద్వారా రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ‘ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌’లో డిజైనింగ్‌కు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. యూఎంవో డిజైన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కళాధర్‌ బాపు మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ డిజైనింగ్‌ అత్యంత కీలకంగా మారిందన్నారు. 2030 నాటికి 10 లక్షల మంది మహిళలకు డిజైనింగ్‌ పరిజ్ఞానంలో శిక్షణనివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సదస్సుకు 16 దేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు వచ్చారని, ఇందులో 40 శాతం మహిళలే కావడం విశేషమన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 07:08 AM