Pole Mounted Transformers: హైదరాబాద్‌లో పోల్ మౌంటెడ్ ట్రాన్స్‌ఫార్మర్లు !
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:22 AM
హైదరాబాద్ నగరంలో పోల్ మౌంటెడ్ ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటుకు టీజీఎ్‌సపీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ పచ్చజెండా ఊపారు..
భూమికి 10 అడుగుల ఎత్తులో ఏర్పాటు
భద్రత, పరిశుభ్రత.. తక్కువ వ్యయం
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎస్‌పీడీసీఎల్ సీఎండీ
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో పోల్ మౌంటెడ్ ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటుకు టీజీఎ్‌సపీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ పచ్చజెండా ఊపారు. ఇకపై ట్రాన్స్‌ఫార్మర్లను ఇదే విధానంలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించడంలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన సూచనల మేరకు అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటులో మార్పులు చేశారు. గతంలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు తక్కువ ఎత్తులో ఉండేవి. ఈ పద్ధతిలో కాంక్రీట్ ఫౌండేషన్‌తో రోడ్డుకు దగ్గరగా ఏర్పాటు చేసే ట్రాన్స్ ఫార్మర్లతో పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందికరంగా ఉండేది. అంతేకాకుండా ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి ప్రమాదకరంగా మారుతున్నాయి. దాంతో కొన్ని సందర్భాలలో షార్ట్‌సర్క్యూట్‌లు, లీకేజీలతో ప్రమాదాలు సైతం జరిగాయి. ఈ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా కొత్తగా పోల్ మౌంటెడ్ పద్ధతిలో 10 అడుగుల ఎత్తులో ఇనుప స్తంభాలపై డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాదచారులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అంతేకాకుండా చెత్త, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు చేరవు. కాంక్రీట్ ఫౌండేషన్‌కు బదులుగా స్తంభాలపై ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంంది. అంబర్‌పేట్ పోలీస్ లైన్స్‌లో ఏర్పాటు చేసిన నమూనాను గురువారం ముషారఫ్ ఫారూఖీ పరిశీలించి, కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్‌లను ఇదే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీజీఎ్‌సపీడీసీఎల్ డైరెక్టర్ డా. నరసింహులు, చీఫ్ ఇంజనీర్ మెట్రో ప్రభాకర్, సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.