Husband Carries Laboring Wife: పురిటినొప్పులతో బాధపడుతున్న భార్యను రెండు కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త
ABN , Publish Date - Aug 11 , 2025 | 05:40 AM
భార్య పురిటినొప్పులతో బాధపడుతుండటం.. రోడ్డుపై బురదతో తండాకు 108 వాహనం రాలేని పరిస్థితి ఏర్పడటంతో
రోడ్డుపై బురదతో వారి తండాకు చేరని 108 వాహనం
మార్గమధ్యలోనే ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం
నాగల్‌గిద్ద, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): భార్య పురిటినొప్పులతో బాధపడుతుండటం.. రోడ్డుపై బురదతో తండాకు 108 వాహనం రాలేని పరిస్థితి ఏర్పడటంతో ఆమె భర్త ఆమెను రెండు కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ఈ ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం శాంతినగర్‌తండా పంచాయతీ పరిధిలోని మున్యానాయక్‌తండాలో జరిగింది. తండాకు చెందిన కౌసల్యబాయి (26) నిండు గర్భిణి.. ఆదివారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ వెంటనే బయలుదేరినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు బురదమయంగా మారడంతో వారి తండాకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయింది. భార్యకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో భర్త వాసుదేవ్ ఆమెను అంబులెన్స్ వద్దకు మోసుకెళ్లేందుకు నిర్ణయించుకొని బయలుదేరాడు. అయితే ఆమెకు పురిటినొప్పులు ఎక్కువై మార్గమధ్యలోనే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె వద్దకు నడుచుకుంటూ చేరుకున్న 108 సిబ్బంది ఆమెను చేతులపై తీసుకెళ్లి వాహనంలోకి ఎక్కించి, కర్‌సగుత్తిలోని ప్రభుత్వ ఆసత్రికి తరలించారు. తల్లి, బిడ్డను పరీక్షించిన వైద్యులు వారు క్షేమంగా ఉన్నారని తెలిపారు. కాగా, అధికారులు, నేతలు ఇప్పటికైనా స్పందించి రోడ్డుసౌకర్యం కల్పించాలని తండా వాసులు కోరారు.