Family Dispute Over Money: భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:25 AM
తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వడం లేదని ఓ భర్త చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడిని రక్షించేందుకు వెళ్లిన అతడి తండ్రి కూడా నీటిలో...
కుమారుడిని కాపాడబోయి తండ్రి కూడా మృతి
18 ఏళ్ల క్రితం ఇదే చెరువులో దూకి తల్లి ఆత్మహత్య
దుబ్బాక, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వడం లేదని ఓ భర్త చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడిని రక్షించేందుకు వెళ్లిన అతడి తండ్రి కూడా నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట- భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన గురుజాల ఎల్లయ్య, చంద్రవ్వల కుమారుడు పరశురాములు తాగుడుకు బానిసయ్యాడు. గ్రామంలో ఓ మహిళ మరణించగా, గురువారం జరిగిన అంత్యక్రియల్లో డప్పు వాయించేందుకు తండ్రీకొడుకులు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన పరశురాములు భార్య గీతను మద్యం తాగేందుకు డబ్బులు అడిగాడు. అప్పటికే తాగిన మైకంలో ఉన్న భర్తకు గీత కొంతడబ్బు ఇచ్చింది. అవి సరిపోవని, మరిన్నీ డబ్బులు ఇవ్వకుంటే చనిపోతానని పరశురాములు బెదిరించాడు. అయినా ఇవ్వకపోవడంతో ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లి గ్రామ శివారులోని బండ్లకుంట చెరువులో దూకాడు. కొడుకును వెతుక్కుంటూ వెళ్లిన తండ్రి ఎల్లయ్య కొడుకు చెరువులో దూకడం చూసి, అతడిని కాపాడేందుకు తానూ దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. భర్త, మామల కోసం గీత, ఆమె తల్లి లక్ష్మి వెతుకుతుండగా చెరువు వద్ద పరశురాములు దుస్తులు, చెప్పులు కనిపించాయి. గ్రామస్థుల సహాయంతో చెరువులో వెతకగా, మొదట పరశురాములు, తర్వాత ఎల్లయ్య మృతదేహాలు బయటపడ్డాయి. భూంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరశురాములుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా 18 ఏళ్ల క్రితం పరశురాములు తల్లి చంద్రవ్వ కూడా ఇదే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.