Share News

Tahsildar: తహసీల్దార్ల నుంచి ఫైళ్లు కదలడం లేదు

ABN , Publish Date - Oct 17 , 2025 | 02:57 AM

భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్నవారు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు...

Tahsildar: తహసీల్దార్ల నుంచి ఫైళ్లు కదలడం లేదు

  • 96,316 దరఖాస్తులు పెండింగ్‌లో.. వీటిలో తహసీల్దార్‌ స్థాయిలో ఉన్నవే 54,346

  • క్షేత్రస్థాయిలో సమన్వయ లోపమే కారణం

  • కలెక్టర్లు ఫోన్‌ చేసినా స్పందించని తహసీల్దార్లు

  • లాగిన్‌ ఐడీ లేదని, అధికారాలు లేవంటున్న అదనపు కలెక్టర్లు

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్నవారు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. సాదాబైనామా, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల కోసం, డేటా కరక్షన్‌ జీపీఏ, నిషేధిత భూములు, నాలా, ఖాతా మెర్జింగ్‌, పెండింగ్‌ మ్యుటేషన్లు, వారసత్వ హక్కులు, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ వివాదాలకు సంబంధించిన దరఖాస్తులు తహసీల్దార్‌ కార్యాలయం దాటడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఎప్పుడు వెళ్లి అడిగినా సీసీఎల్‌ఏ నుంచి స్పష్టత రాలేదు.. విధివిధానాలు రాలేదు.. మార్గదర్శకాలు రావాల్సి ఉందంటూ దరఖాస్తుదారులను తిప్పిపంపుతున్నారనే విమర్శలున్నాయి. ఇలాంటి సమస్యలకు సంబంధించి ఈనెల 14వ తేదీ వరకు 96,316 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే అందులో 54,346 దరఖాస్తులు తహసీల్దార్‌ స్థాయిలో 18,796 దరఖాస్తులు ఆర్డీవో స్థాయిలో, 11,730 దరఖాస్తులు అదనపు కలెక్టర్ల స్థాయిలో, 11,444 కలెక్టర్ల స్థాయులో పెండింగ్‌లో ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం జిల్లాలో పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక్క రంగారెడ్డి జిల్లాలో 17,779 దరఖాస్తులు పెండింగ్‌ ఉండగా, వీటిలో తహసీల్దార్‌ స్థాయిలో 10,095 పెండింగ్‌ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 9,838 దరఖాస్తులు పెండింగ్‌ ఉంటే అందులో 6,458 దరఖాస్తులు తహసీల్దార్ల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ జిల్లాల్లో కొంతమంది తహసీల్దార్లకు కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు ఫోన్‌ చేసినా తహసీల్దార్లు కనీసం ఫోన్‌ కూడా లిఫ్ట్‌ చేయరనే విమర్శలున్నాయి. ఎన్ని సమావేశాలు పెట్టినా తహసీల్దార్లు ఏదో ఒక కొర్రీ వేయడంతో దరఖాస్తుల పరిష్కారం ముందుకు సాగడం లేదనే విమర్శలున్నాయి. డాటా కరెక్షన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 42,431 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే అందులో తహసీల్దార్ల స్థాయిలో 25,509 పెండింగ్‌లో ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలకు సంబంధించి 23,813 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే తహసీల్దార్ల స్థాయిలో 8,265 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వారసత్వ వివాదాలకు సంబంధించి 9,452 పెండింగ్‌ ఉంటే, వీటిలో తహసీల్దార్ల స్థాయిలో 7,062 పెండింగ్‌లో ఉన్నాయి. మ్యుటేషన్‌కు సంబంధించి రాష్ట్రంలో 7,918 కేసులు పెండింగ్‌ ఉంటే అందులో 5,682 దరఖాస్తులు తహసీల్దార్ల స్థాయిలో ఉన్నాయి.


సాదాబైనామా విషయంలో గందరగోళం

రెవెన్యూ సదస్సుల తర్వాత సాదాబైనామా దరఖాస్తులు 900880 పెండింగ్‌లో ఉన్నట్లు అధికారుల నివేదికల్లో చూపుతున్నారు. వీటికి సంబంధించి ఇప్పటి వరకు 8,55,529 మందికి నోటీసులు పంపారు. ఇంకా 45,351 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. మొత్తం దరఖాస్తుల్లో అప్రూవల్‌ దశలో ఉన్నవి 9022 మాత్రమే. అఫిడవిట్‌ తీసుకోవాలనే గందరగోళ పరిస్థితి ఉండటం, సీసీఎల్‌ఏ నుంచి స్పష్టత లేదని, మార్గదర్శకాలు రాలేదనే కారణాలు చెప్పి సమస్య పరిష్కారాన్ని క్షేత్రస్థాయి అధికారులు వాయిదా వేస్తున్నారు. ఫలితంగా దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సాదాబైనామాకు సంబంధించి అత్యధిక దరఖాస్తులు ఖమ్మం జిల్లా నుంచే ఉన్నాయి. ఈ జిల్లాలో 1,11,442 దరఖాస్తులు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో 81,626, మహబూబాబాద్‌ 80,002, వరంగల్‌ 53,996, జనగాం 33,305, ములుగు 34,440, హనుమకొండ 42,502, కొత్తగూడెం 62510, భూపాలపల్లి 51,347, సిద్దిపేట 44,583, పెద్దపల్లి 35,323, కరీంనగర్‌ జిల్లాల్లో 26,871 దరఖాస్తులున్నాయి. వీటిపై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం

అధికారుల మధ్య సమన్వయ లోపం దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. పెండింగ్‌ దరఖాస్తులపై ప్రతి సోమవారం రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌ అదనపు కలెక్టర్ల (రెవెన్యూ)తో సమీక్ష చేసినా ఆశించిన పురోగతి కనిపించడం లేదు. అదనపు కలెక్టర్లకు లాగిన్‌ లేకపోవడంతో ఏ తహసీల్దార్‌ వద్ద ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌ ఉన్నాయో తెలుసుకునే అవకాశం లేదు. కిందిస్థాయి సిబ్బంది మీద చర్యలు తీసుకునే అధికారాలు కూడా లేకపోవడంతో తమమాట వినడం లేదని చాలామంది అదనపు కలెక్టర్లు వాపోతున్నారు. ఆర్డీవోలు రోజువారీ సమీక్షలు చేయడం లేదు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు మధ్య కూడా సమన్వయం లేదనే విమర్శలున్నాయి. నేరుగా నియామకం అయ్యే కలెక్టర్లు.. తహసీల్దార్‌ నుంచి పదోన్నతి పొంది అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న వారి సలహాలు, సూచనలను కలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు. కొంతమంది కలెక్టర్లు తమను పురుగుల్లా చూస్తున్నారని అదనపు కలెక్టర్లు కొందరు సహచరుల వద్ద వాపోతున్న సందర్భాలున్నాయి.

Updated Date - Oct 17 , 2025 | 02:57 AM