Share News

Land Possession: కేపీహెచ్‌బీలో 300 కోట్ల విలువైన స్థలాల స్వాధీనం

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:29 AM

కూకట్‌పల్లిలో సుమారు రూ.250-300 కోట్ల విలువైన స్థలాలు హౌసింగ్‌బోర్డు ఆధీనంలోకి వచ్చాయి. కూకట్‌పల్లి సర్వేనంబర్‌...

Land Possession: కేపీహెచ్‌బీలో 300 కోట్ల విలువైన స్థలాల స్వాధీనం

కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లిలో సుమారు రూ.250-300 కోట్ల విలువైన స్థలాలు హౌసింగ్‌బోర్డు ఆధీనంలోకి వచ్చాయి. కూకట్‌పల్లి సర్వేనంబర్‌ 1009లో 65ఎకరాలకు సంబంధించి 2005లో అప్పటి ఏపీహెచ్‌బీ జాయింట్‌ వెంచర్‌ కింద చిడ్కో సంస్థతో ఒప్పందం చేసుకుంది. కానీచిడ్కో నిబంధనలు పాటించకపోవడంతో ఖాళీగా ఉన్న రెండు వేర్వేరు స్థలాలను బుధవారం వెస్ట్రన్‌, నార్త్‌ డివిజన్‌ ఈఈలు మంజుల, అంకమరావు క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్‌బీలో ఇందూ ప్రాజెక్టుకు ఇరువైపులా ఈ రెండు ఖరీదైన స్థలాలున్నాయి. 2.57ఎకరాల్లో ఆఫీస్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ ఉన్న ప్రాంతం, 3.25 ఎకరాల్లో అసంపూర్తిగా ఉన్న ఎల్‌ఐజీ గృహాలు హౌసింగ్‌ బోర్డు ఆధీనంలోకి వచ్చాయని పీఆర్వో వాసు తెలిపారు. వీటివిలువ రూ.250-300కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. హౌసింగ్‌బోర్డు వీసీ వీపీ గౌతమ్‌ ఆదేశాల మేరకు ఈ నెల 23న నోటీసు ఇచ్చి 24న ఖాళీ చేయాలని సూచించారు. అక్కడ ఉంటున్న బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ నిర్వాహకులు కాస్త సమయం కావాలని కోరినా.. అధికారులు అంగీకరిచలేదు. ‘మేము నిన్ననే మీకు నోటీస్‌ ఇచ్చాం. మేం ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయక తప్పదు. మీరు గంటలో ఖాళీ చేయాల’ని ఆదేశించారు. ఎట్టకేలకు మూడు గంటల వ్యవధిలో ఆ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Dec 25 , 2025 | 05:29 AM